ఆర్‌ఐవో జి.సునీత
గుంటూరు ఎడ్యుకేషన్:స్పాట్ వాల్యూయేషన్ విధి నిర్వహణలో అధ్యాపకులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని ఇంటర్మీడియెట్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐవో) జి.సునీత పేర్కొన్నారు. ఆదివారం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమించిన అధ్యాపకులకు ఇంటర్మీడియెట్ బోర్డు నిర్దేశించిన వాల్యూయేషన్ నిబంధనలు, మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఆర్‌ఐవో, స్పాట్ వాల్యూయేషన్ క్యాంపు అధికారి సునీత మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థుల ఆన్సర్ షీట్లకు మూల్యాంకనం నిర్వహించేందుకు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొదటి స్పెల్‌లో భాగంగా జనరల్ కోర్సుల వారీగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితం, చరిత్ర, ఎకనామిక్స్ సబ్జెక్టులతోపాటు ఒకేషనల్ విభాగంలో ఇంగ్లీషు, జీఎఫ్‌సీ, ఏ అండ్ టీ, సీఎస్‌ఈ, ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ సబ్జెక్టులకు మూల్యాంకన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మూల్యాంకన విధులకు నియమితులైన అధ్యాపకులందకూ బోర్డు నిర్ధేశించిన స్కీమ్ ఆఫ్ వాల్యూయేషన్ నిబంధనలకు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులకు మౌళిక వసతుల పరంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. స్పాట్ వాల్యూయేషన్ విధుల్లో నిమగ్నమైన అధ్యాపకులు మొబైల్ ఫోన్ వినియోగించరాదని పేర్కొన్నారు. సమావేశంలో సహాయ క్యాంపు అధికారులు బి. ఉమాదేవి, జయశీల, కోడింగ్ అధికారులు సుచరిత, బాలమోహన్ పాల్గొన్నారు.


