లక్ష్మీపురం: మొక్కజొన్న, పెసర రైతులకు మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు కీలకమైనదని తెలిపారు. ప్రస్తుతం పప్పు ధాన్యాల రైతులు భారీగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ పరిస్థితికి రెండు ప్రధాన కారణాలున్నాయని పేర్కొన్నారు. ఒకటి కేంద్ర ప్రభుత్వం విదేశీ దిగుమతులకు అనుమతులు ఇవ్వడంతో పెద్ద వ్యాపారులు విదేశాల నుంచి తక్కువ ధరలకు దిగుమతులు చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో మొక్కజొన్న ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిందని, డెల్టా ప్రాంతంలో కూడా మరో 20 రోజుల్లో రాబోతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రూ.2400 మద్దతు ధర రావాల్సిన రైతులు రూ.1500, రూ.1550కే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మినుము, పెసరకు సంబంధించి కూడా మార్కెట్లో ధరలు మద్దతు ధర కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. మినుము మద్దతు ధర రూ.8760 ఉండగా, రైతులు సుమారు రూ.8000కే అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు మరింత నష్టపోతున్న నేపథ్యంలో, పంటలను తక్కువ ధరలకు అమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు.
సీపీఐ జాతీయ కమిటీ సభ్యులు
ముప్పాళ్ల నాగేశ్వరరావు


