ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. 10కే వాక్
గుంటూరు ఎడ్యుకేషన్: ‘ఆరోగ్యం కోసం నడక–గుంటూరు కోసం నడక’ నినాదంతో నిర్వహించిన 10 కిలోమీటర్ల నడక (10కే వాక్) ఉల్లాసంగా, ఉత్సాహంగా కొనసాగింది. ఆదివారం ఉదయం విద్యానగర్‌లోని ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన గుంటూరు 10కే వాక్‌ను సినీ, రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు ప్రారంభించారు. విద్యానగర్ నుంచి మొదలైన నడక లక్ష్మీపురం, అమరావతిరోడ్డు, చిల్లీస్, ఇన్నర్‌రింగ్‌రోడ్డు, జేకేసీ కళాశాల మీదుగా తిరిగి ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలకు చేరుకుంది. చిన్నారులతో పాటు యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గుంటూరు 10కే వాక్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, కన్వీనర్‌గా కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు వ్యవహరించారు.
సులువుగా చేసే వ్యాయామమే:
సినీ నటుడు రాజేంద్రప్రసాద్
గుంటూరు 10కే వాక్‌లో సినీ నటుడు రాజేంద్రప్రసాద్, నటి కామ్నాజెఠ్మలానీతో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నడక అనేది ఖరీదైన వ్యాయామం కాదని, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో నడకను అలవాటు చేసుకోవచ్చని చెప్పారు. కామ్నా జెఠ్మలానీ మాట్లాడుతూ నిత్యం నడక ద్వారా మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నడకతో ఆరోగ్యగాన్ని పెంపొందించుకోవచ్చునని, డ్రగ్స్ వాడకం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరిలు మాట్లాడారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్థాలపై ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ సారధ్యంలో పోస్టర్లు ప్రదర్శించారు.
విజేతలకు బహుమతులు
10కే వాక్ పురుషు, మహిళల విభాగంలో నాలుగు కేటగిరీలుగా విభజించి, ప్రతి కేటగిరీలో తొలి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. విజేతలకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు బహుమతులు అందజేశారు. కార్యక్రమ కో–కన్వీనర్ పిడికిటి తిలక్‌బాబు, మలినేని పెరుమాళ్లు, టీవీరావు, మాజీ డీజీపీ ఎంవీ రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, నర్సరాజు, చిట్టాబత్తుని చిట్టిబాబు, బీజేపీ నేత తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
నడకలో పాల్గొన్న నగర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు
నడక ఖరీదైన వ్యాయామం కాదు :
సినీ నటుడు రాజేంద్రప్రసాద్
ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. 10కే వాక్


