దళితులను బలిగొంటున్న చంద్రబాబు సర్కార్
దాచేపల్లి, పిడుగురాళ్ల: చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దళితులను బలితీసుకుంటోందని, ఎర్రబుక్ పాలన పేరిట ఎర్రి పరిపాలన కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత కార్యకర్త మందా సాల్మన్‌ను ఇటీవల టీడీపీ గూండాలు హత్య చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన సాల్మన్ దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ... గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గూండా రాజ్యం సాగుతోందని, నియోజకవర్గాన్ని రక్తమయం చేస్తూ దళితలను అణచివేయడంతోపాటు మరణకాండకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసమర్థ చంద్రబాబు పరిపాలనలో దళితులు, బలహీనవర్గాల వారిని హత్యలు చేస్తున్నారని తెలిపారు. ఇవన్నీ కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. వీటిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ తెలుగుదేశం నాయకుల ద్వారా చేయిస్తోందని మండిపడ్డారు. పొన్నూరులో టీ స్టాల్ వద్ద ఉన్న ఎస్సీ సర్పంచ్‌పై రాడ్ తీసుకుని దాడి చేస్తే నిందితులపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్‌ని టీడీపీ గూండాలు హత్య చేసినా చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ చంద్రబాబు చేయిస్తున్న నరమేధం అని ఆరోపించారు. సాల్మన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎర్రబుక్ పాలన పేరిట
ఎర్రి పరిపాలన
వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్


