జీఎంసీలోకి మరో 11 గ్రామాలు
● ప్రస్తుతం విలీన గ్రామాల్లోనే మౌలిక వసతులు శూన్యం
●ఈ నెల 12న కౌన్సిల్
అత్యవసర సమావేశం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థ గ్రేటర్ గుంటూరు దిశగా అడుగులు వేస్తుందనే చెప్పుకోవచ్చు. 2012లో నగరం చుట్టూ ఉన్న 10 గ్రామాలను విలీనం చేయగా, తాజాగా 11 గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ నెల 12వ తేదీన అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసేందుకు పాలక, అధికార వర్గాలు ముందుకు సాగుతున్నాయి.
విలీన గ్రామాల్లో మౌలిక వసతులు కరువు
2012లో నల్లపాడు, పెదపలకలూరు, అంకిరెడ్డిపాలెం, అడవితక్కెళ్లపాడు, గోరంట్ల, పొత్తూరు, చౌడవరం, ఏటూకూరు, బుడంపాడు, రెడ్డిపాలెం గ్రామాలు విలీనం అయ్యాయి. వీటిలో సక్రమంగా తాగునీరు అందించడం, పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు విఫలం అయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు 11 గ్రామాలను విలీనం చేస్తే వాటికి కూడా నగరపాలక సంస్థ నుంచే తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది.
11 గ్రామాలు ఇవే..
గుంటూరు నగరపాలక సంస్థను గ్రేటర్ గుంటూరుగా చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా 11 గ్రామాలను విలీనం చేసేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేశారు. చల్లావారిపాలెం, చినపలకలూరు, తురకపాలెం, వెంగళాయపాలెం, దాసుపాలెం, గొర్లవారిపాలెం, జొన్నలగడ్డ, లాల్‌పురం, మల్లవరం, ఓబులునాయుడుపాలెం, తోకవారిపాలెంలను విలీనం చేసేందుకు పంచాయతీ అధికారులు అంగీకరించారు. దీనికి సంబంధించిన ప్రకటనను నగరపాలక సంస్థ సిద్ధం చేశారు. 12న జరిగే అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఆమోదించనున్నారు. తరువాత జిల్లా కలెక్టర్ అనుమతితో ప్రభుత్వానికి నివేదిక వెళ్లిన తరువాత ప్రభుత్వం 11 గ్రామాలను విలీనం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది.


