డాక్టర్ నందకిషోర్‌కు ఐఎంఏ రాష్ట్ర ఉత్తమ అధ్యక్ష అవార్డ
గుంటూరు మెడికల్ గుంటూరుకు చెందిన సీనియన్ ఈఎన్‌టీ సర్జన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిషోర్‌కు ‘ఉత్తమ రాష్ట్ర అధ్యక్షుని అవార్డు’ లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, వైద్యుల సమస్యల్ని తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులతో కలిసి రాష్ట్ర ప్రజారోగ్య పరిరక్షణ చర్యలలో పాలుపంచుకోవడం వంటి సేవలకుగాను 2024–2025 సంవత్సరానికి డాక్టర్ నందకిషోర్‌కు ఈ అవార్డు ప్రకటించారు. ఈ మేరకు ఐఎంఏ జాతీయ కార్యాలయం ఢిల్లీ నుంచి సమాచారం వచ్చింది. ఈ అవార్డును ఈనెల 27, 28 తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో నిర్వహించే ఐఎంఏ జాతీయ సదస్సులో ప్రముఖుల చేతుల మీదుగా డాక్టర్ నందకిషోర్ అందుకోనున్నారు. తనకు జాతీయఅవార్డు లభించిన సందర్భంగా రాష్ట్ర వైద్యులందరికీ డాక్టర్ నందకిషోర్ కతజ్ఞతలు తెలిపారు .జాతీయ అవార్డు కు ఎంపిక కావడం పట్ల ఐఎంఏ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నాగెళ్ల కిషోర్, సిజిపి డైరెక్టర్ డాక్టర్ ఎం.ఫర్నికుమార్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.సుభాష్ చంద్రబోస్, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.బాలరాజు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్, డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు తదితరులు అభినందనలు తెలిపారు. గుంటూరు బ్రాంచ్‌కి చెందిన డాక్టర్ నందికిషోర్‌కి ఈ అవార్డు లభించడం పట్ల ఐఎంఏ గుంటూరు శాఖ ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ టీ.సేవకుమార్, పూర్వఅధ్యక్షుడు డాక్టర్ వై. సుబ్బారాయుడు, కార్యదర్శి డాక్టర్ బి.సాయికృష్ణ, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం.శివప్రసాద్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సిహెచ్.శ్రీనివాసరెడ్డి, బ్రాంచ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
నరసరావుపేట ఈస్ట్: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారనే కారణంలో వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి 12 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయటం సరికాదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్వర్ణ చినరామిరెడ్డి, కార్యదర్శి చుక్కా వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ సస్పెండ్‌కు దారితీసిన పరిస్థితులపై సమీక్షించారు. ఈనెల 3వ తేదీన గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సందర్శించారనీ, ఆ సమయంలో ఆరోగ్య కేంద్రాన్ని తాళం వేసి ఉండటాన్ని గమనించి కేంద్రంలోని 12 మందిని సస్పెండ్ చేయటం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ఆరోజున కేంద్రంలోని ముగ్గురు ఉద్యోగులు సెలవుపై ఉన్నారనీ, మిగిలిన వారు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధి నిర్వహణలో ఉన్నారని తెలిపారు. ఉద్యోగుల వివరణ కోరకుండా సస్పెండ్ చేయటం బాధాకరమని తెలిపారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దీనిపై పునరాలోచించి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రట రీ షేక్.బాజీ, తాలూకా యూనిట్ నాయకులు ఎం.ఫ్లోరెన్స్, ఎస్.చలమారెడ్డి, ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.


