ధాన్యం రైతుల ఆందోళన పట్టని ప్రభుత్వం
●తేమశాతంతో పనిలేకుండా కొనుగోలు చేయాలి
●ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి
తెనాలి: ఖరీఫ్ సీజనులో ధాన్యం దిగుబడులు తగ్గి, ధరలు పడిపోవటంతో అన్నదాతలు ఆందోళన పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి విమర్శించారు. స్థానిక చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో మంగళవారం సీఐటీయూ డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్‌వలితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత సంవత్సరం 75 కిలోల ధాన్యం బస్తా బయట మార్కెట్లో రూ.1480 ఉండగా ఈ సంవత్సరం రూ.1280లకే వ్యాపారులు కొంటున్నారని తెలిపారు. గత సంవత్సరం 35–40 బస్తాలు దిగుబడి రాగా ఈ సంవత్సరం 25–30 బస్తాలు లోపే వస్తున్నాయని చెప్పారు. గత నెలలో మోంథా తుఫాన్ కారణంగా వరి దిగుబడి తగ్గిందన్నారు. కొన్నిచోట్ల చేలు పడిపోయినా, ప్రభుత్వం కనీసం నష్టం నమోదు చేయకపోవటం శోచనీయమన్నారు. కౌలురైతులు ఎకరాకు 25–32 బస్తాలు ధాన్యం లేదా రూ.25–40 వేల నగదుకు కౌలుకు తీసుకున్నారని గుర్తుచేశారు. తుఫాన్‌కు నేలవాలిన చేలల్లో హార్వెస్టింగ్‌కు అదనపు ఖర్చవుతోందని చెప్పారు. కొనుగోలు కేంద్రంలో తేమశాతం 17 చూపిస్తే, మిల్లులకు వెళ్లాక 21 శాతంగా చూపుతున్నారని శివసాంబిరెడ్డి తెలిపారు. ఈ కారణంగా రైతులు దగ్గర నాలుగు నుంచి ఐదు కిలోలు తరుగు తీస్తున్నారని చెప్పారు. ఒకేసారి కోతలు రావటం వలన హార్వెస్టింగ్ మిషన్లు కొరత, టార్పాలిన్లు లేనందున రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తేమశాతంతో పనిలేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.


