రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు అరెస్ట్
రూ.6.22 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం అరెస్ట్ చేసిన జీఆర్‌పీ పోలీసులు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలను గుర్తించి వారి వద్ద గల బ్యాగ్‌లలో ఉండే బంగారం చోరీ చేసే ఆరుగురిని జీఆర్పీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ అంజిబాబు వివరాలు వెల్లడించారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పలు రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలను టార్గెట్ చేసి బంగారం, నగదును చోరీ చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడండతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో సీఐ అంజిబాబు, ఆర్‌పీఎఫ్ సీఐ వీరబాబు, సీఐబీ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపులు ప్రారంభించారు. శుక్రవారం గుంటూరు రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేస్తున్నారు. కొందరు పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వారందరు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన వారిగా గుర్తించారు. వారిలో తాడేపల్లిగూడెం, యగర్లపల్లి ప్రాంతానికి చెందిన ఎర్రసాని గోవిందరాజు, ఎర్రసాని దుర్గాప్రసాద్, పెదాల రాజు, దేవరపల్లి, జ్యోతినగర్ ప్రాంతానికి చెందిన గీరాక వరలక్ష్మి, మెడ నరసయ్య, కొడటి అమృతల వద్ద బ్యాగ్‌లను పరిశీలించారు. వారి వద్ద రూ.6.22 లక్షల విలువ చేసే 75 గ్రాముల బంగారు ఆభరణా లు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని విచారించగా రైళ్లలో ఒంటరి మహిళలను గుర్తించి చోరీ చేస్తున్నట్లు విచారణలో తెలింది. వారిని రిమాండ్‌కు తరలించారు. జీఆర్పీ మహిళ ఎస్సై ఓ.దీపిక, ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి, సీఐబీ ఎస్‌ఐ శ్రీనివాస్, సుభానీలను డీఎస్పీ అభినందించారు.


