ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సింది గురువులే
తెనాలి:రేపటి పౌరులైన నేటి బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని సినీనటు డు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. రూరల్ మండల గ్రామం కొలకలూరులోని జిల్లా పరిషత్ హైస్కూలులో శుక్రవా రం వల్లూరి వెంకటేశ్వరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్.నారాయణమూర్తి పండిట్ జవవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించా రు. విద్యార్థి జీవితంలో ఇష్టంగా చదువుకుంటే జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగుతారని చెప్పారు. రచయిత, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్య దోహదం చేస్తుందని చెప్పారు. రచనా రంగం, లలిత కళల్లో ఏదొకదానిలో విద్యార్థులు నైపుణ్యం సాధించాలని సూచించారు. తమ తండ్రి వల్లూరి వెంకటేశ్వరరావు స్మారకార్థం ఏటా స్వస్థలమైన కొలకలూరు హైస్కూలులో బాలల దినోత్సవం జరుపుతున్నట్టు గుర్తుచేశారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, సాంస్కృతిక విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు మాచర్ల నాగేశ్వరరావు, కావూరి చంద్రమోహన్, వల్లూరు వరప్రసాదరావు, షేక్ జిలాని, నల్లిబోయిన నాగేశ్వరరావు,వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


