ప్రాసెసింగ్ యూనిట్లపై అవగాహన పెంచాలి
బాపట్ల: ౖరెతులకు ప్రాసెసింగ్ యూనిట్లపై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైన ఉందని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేటెడ్ డీన్ డాక్టర్ డీడీ స్మిత్ పేర్కొన్నారు. కళాశాలలో గురువారం రైతులకు మిల్లెట్ల ప్రాసెసింగ్, విలువ వృద్ధిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పప్పుధాన్యాలకు సంబంధించిన ప్రాసెసింగ్‌పై రైతులకు అవగాహన పెంచాలని సూచించారు. గ్రామీణ యువత మిల్లెట్ల ప్రాసెసింగ్ ద్వారా కొత్త పారిశ్రామిక అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. మిల్లెట్లు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలుగా గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో వాటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చన్నారు. విశ్వవిద్యాలయం వారు రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం ఆధునిక ప్రాసెసింగ్ సాంకేతికతలను అందుబాటులోకి తెస్తోందని ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు రైతులలో వ్యాపారస్ఫూర్తిని పెంచుతాయని పేర్కొన్నారు. విభాగాధిపతులు డాక్టర్ జి.రవిబాబు, డాక్టర్ బి.శ్రీనివాసులరెడ్డి, డాక్టర్ కేవీఎస్ రామిరెడ్డి, డాక్టర్ ఎస్.విష్ణువర్ధన్, డాక్టర్ కె.లావణ్య తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేటెడ్ డీన్ డాక్టర్ డీడీ స్మిత్


