
28న ధర్నాను జయప్రదం చేయండి
మంగళగిరి టౌన్: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏడీ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పి నేటికీ అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు రూ.203 కోట్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చేనేత రక్షణకు 11 రకాల రిజర్వేషన్లు అమలు జరపాలని కోరారు. చేనేతపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలన్నారు. చేనేత కార్మికులకు, సహకార సంఘాల్లో లేనివారికి ఇవ్వాల్సిన ట్రిప్ట్ ఫండ్ రూ.27 కోట్లను కూడా విడుదల చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): సౌత్ జోన్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ద ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ షూటర్లు 20 మంది రైఫిల్, పిస్టల్ విభాగాలలో ప్రతిభ కనబరిచారని అకాడమీ చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వర రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి జరిగే జాతీయ పోటీలకు ఎంపిక అయ్యారన్నారు. రైఫిల్ విభాగంలో వట్టిమల్లీ షణ్ముఖ రుష్యేంద్ర, శ్రీరంగ సాయి చరణ్, పారా ఆశ్రిత్ చౌదరి, వజ్జు దారియా, ఎం. కార్తికేయన్, దాసరి సౌమ్యశ్రీ, చిన్ను తేజస్, కాగిత విద్యావల్లి, కాగిత కుసుమవల్లి, కె.ఎస్.ఎస్ చక్రవర్తి, మట్లి యోక్షిత్ రెడ్డి, షేక్ హబీబా సుహానా, అన్నా బత్తిని రోహిత్ ఎంపికయ్యారని తెలిపారు. పిస్టల్ విభాగంలో కొసన పూర్ణిమ, సోడిశెట్టి ధరణీనాథ్, రాజ రాజేశ్వరి, ఒంటెద్దు నాగ లోహిత్ రెడ్డి, గ్రీష్మ సందేశి, అభిలాష్ చంద్ర, రిషిక్ బాబులు అర్హత సాధించారన్నారు. వీరిని రాప్ సెక్రెటరీ డి. రాజ్ కుమార్ తదితరులు అభినందించారన్నారు.
నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్గనైజేషనల్ సెక్రటరీలుగా నరసరావుపేటకు చెందిన గెల్లి బ్రహ్మారెడ్డి, యన్నం రాధాకృష్ణారెడ్డి, గురజాలకు చెందిన కలకంధ అంధ్రయ్యను యాక్టివిటీ సెక్రటరీగా నియమితులయ్యారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులుగా కండ్రకుంట మరియమ్మను నియమించారు.
కూటమి ప్రభుత్వ వైఖరిపై జెడ్పీటీసీ సభ్యుడు ఓబుల్‌రెడ్డి ఆగ్రహం
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీటీసీ సభ్యురాలు తన మండలంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్టుషాపులను అరికట్టాలని స్థానిక ఎమ్మెల్యే అయిన విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు లేఖ రాయడం నేరమా అని రొంపిచర్ల వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్‌రెడ్డి ప్రశ్నించారు. దుగ్గిరాల వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ భర్తను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం చేసిన పిల్లి ఓబుల్‌రెడ్డి... ఈ ఘటనను వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉన్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా బెల్టుషాపులకు, నకిలీ మద్యానికి తావు లేకుండా పాలన సాగిందని పేర్కొన్నారు. అరెస్టు విషయంలో న్యాయం జరిగే వరకు బాధితులకు తాము అందరం అండగా ఉంటామని ఆయన తెలిపారు.