
వైఎస్సార్‌సీపీలో చేరిక
టీడీపీ నాయకురాలి కుటుంబ సభ్యులు
మంగళగిరి టౌన్: మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి కుటుంబంలోని కొందరు వైఎస్సార్‌సీపీలో చేరడమే దీనికి కారణం. తొలుత పాత మంగళగిరి సీతారామ కోవెల సెంటర్ నుంచి ఆత్మకూరు నియోజకవర్గ కార్యాలయం వరకు సుమారు వందమందికిపైగా యువతతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంగళగిరి వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం జానకీదేవి తోటికోడలు అయిన తమ్మిశెట్టి అనూరాధతోపాటు జితేంద్ర, గౌతమి, బిట్ర శ్వేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డిలు పార్టీ కండువాలు కప్పి, అభినందించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించడంతో పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. పార్టీపై, అధినాయకుడిపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని మురుగుడు, డీవీఆర్‌లు సూచించారు. జానకీదేవి ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబరుగా ఉన్నారు. మొదటి నుంచి బీజేపీ నేపథ్యం ఉన్న ఆమె 2004లో మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి మళ్లీ పోటీ చేసినా ఓడిపోయారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.