
ఉచిత వైద్యం అందకుండా కూటమి కుట్ర
చేబ్రోలు: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి, ప్రజలకు ఉచిత వైద్యం అందకుండా చేయాలనే కుట్రతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తోందని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా శుక్రవారం సంతకాలు సేకరించారు. చేబ్రోలు మండలం సుద్దపల్లిలో పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు కూలీలకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై అవగాహన కల్పించారు. రచ్చబండ సమావేశంలో అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ పేద విద్యార్థులకు వైద్య విద్య అందించటంతో పాటు బడుగులకు ఉచిత వైద్యం అందించేలా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్మిస్తే.. కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఆళ్ల శ్రీరామిరెడ్డి, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు బి.భాస్కరరెడ్డి, అక్కిరెడ్డి, శంకరరావు, చందు సాంబశివరావు, పోతురాజు, గోపి, మమత, దాసరి దానమ్మ, చిరంజీవి, జానీ, వేణు, బాల చంద్రయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త
అంబటి మురళీకృష్ణ
సుద్దపల్లిలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం