
విజ్ఞాన్ యూనివర్సిటీలో 5జీ ల్యాబ్ ప్రారంభం
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన 5జీ ల్యాబ్ – గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏ.రాబర్ట్ జే రవి వర్చువల్‌గా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5జీ ల్యాబ్ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, స్మార్ట్ సిటీస్, లాజిస్టిక్స్, ఈ–గవర్నెన్స్ వంటి కీలక రంగాలలో నవీన ఆవిష్కరణలు, అనువర్తనాలను అభివృద్ధి చేసే దిశగా ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. ల్యాబ్‌లో పూర్తిస్థాయి 5జీ స్టాండలోన్ సెటప్ ఏర్పాటు చేయబడిందని, ఇందులో సిమ్‌లు, డాంగిల్స్, ఐవోటీ గేట్‌వేలు, రౌటర్లు, అప్లికేషన్ సర్వర్లు మొదలైన పరికరాలు ఉంటాయన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం మాట్లాడుతూ 5జీ ల్యాబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, విద్యార్థులు రియల్‌టైమ్‌లో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రాజెక్ట్ ఆధారిత లెర్నింగ్, లైవ్ డేటా అనలిటిక్స్ ద్వారా పరిశోధన మరింత బలోపేతం అవుతుందని వివరించారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు నూతన సాంకేతికతలలో ముందంజలో ఉండేందుకు 5జీ ల్యాబ్ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు పాల్గొన్నారు.