
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి అనాగరిక చర్య
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
గుంటూరు వెస్ట్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయిపై సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాది చేసిన దాడి సభ్యసమాజానికి సిగ్గుచేటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. సోమవారం స్థానిక డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. కృష్ణమాదిగ విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి దళితుడు కావడం వల్లే ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక అభిప్రాయాలుంటాయన్నారు. దానికి ఇలా దాడులు చేయడం అత్యంత హేయమన్నారు. దళితులు దేశంలో ఎన్నో వివక్షలకు గురౌతూ ఎదుగుతుంటే కొంత మంది ఓర్వలేక అక్కసుతోనే ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారన్నారు. దళితులు మరింత పట్టుదలతో ఉన్నత స్థానాలను పొందాలని కోరారు.
గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీని డీఆర్వో జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... తగ్గిన పన్నుల శాతంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి గత నెల 22 నుంచి ఈ నెల 19వ తేదీ వరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ బైక్ ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆశారాణి తదితరులు ప్రసంగించారు. బైక్ ర్యాలీ కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల సెంటర్, జిన్నా టవర్, బస్టాండ్, మంగళగిరి రోడ్డు మీదుగా ఆటోనగర్ వరకు కొనసాగింది.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి అనాగరిక చర్య