
బీసీ హాస్టళ్లలో వసతులు మెరుగుపరచాలి
గుంటూరు మెడికల్: అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు కారణమైన వార్డెన్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బీసీ వసతి గృహాలలో వసతులు మెరుగు పరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను సోమవారం మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి బలసాని కిరణ్‌కుమార్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి షేక్ నూరి ఫాతిమా, రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్‌లు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ వార్డెన్ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఆహారం విషపూరితంగా మారిందని, విద్యార్థులు తెల్లవార్లు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడినా సకాలంలో స్పందించలేదని వెల్లడించారు. వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హాస్టళ్లలో భోజనం బాగుందని, మెను బాగా పెట్టేవారని విద్యార్థులు తమతో చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భోజనం బాగుండటం లేదని వెల్లడించారన్నారు. అందుకే విద్యార్థులు నీరసించి పోయారన్నారు. ఎవరైనా సమస్యల గురించి తమ తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిస్తే చాలు ఆ విద్యార్థులను వార్డెన్ చితకబాదుతున్నట్లు ఆరోపించారు. ఇలాంటి వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
భయపడుతున్న తల్లిదండ్రులు
విద్యార్థులను హాస్టల్‌లో ఉంచేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారని, ఇళ్లకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారని, ఇది ప్రభుత్వం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌లు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. హాస్టల్‌నే సరైన దిశగా నడిపించలేని వీరు రాష్ట్రాన్ని పరిపాలించగలరా అని ప్రశ్నించారు. జిల్లాలో నెలరోజులుగా పలు పెద్ద సంఘటనలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. తురకపాలెంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయని, అయినప్పటికీ నేటి వరకు కారణాలు ప్రభుత్వం తెలుసుకోలేకపోయిందన్నారు. గుంటూరు నగరంలో గతనెలలో డయేరియాతో 200 మందికిపైగా చికిత్స పొందారని, తాజాగా బీసీ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతతో చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల విద్యార్థులు అస్వస్థతకు గురై అవస్థలు పడుతున్నారని, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. తక్షణమే హాస్టల్‌ను సందర్శించి వసతులు మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. మూడు రోజుల్లో వసతులు మెరుగు పడకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బలసాని కిరణ్‌కుమార్ మాట్లాడుతూ హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు వార్డెన్ ఫోన్ చేసి చెప్పలేదన్నారు. వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తురకపాలెంలో అనుకూలంగా ఉన్న కొంత మందికి రూ. 5 లక్షలు ఇచ్చి కంటి తుడుపు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఇక్కడ మరణాలకు కారణాలు తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నూరిఫాతిమా మాట్లాడుతూ వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశారని చెప్పారు. నేడు రాష్ట్రంలో ఆ రంగాలు వెంటిలేటర్‌పై ఉన్నాయన్నారు. వరుసగా పలు సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని, ప్రజలు చచ్చిపోతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు నిర్లక్ష్యంగా ఉన్నారని, అందరూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం వల్లే ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయని, ప్రజలు బుద్ధి చెప్పే సమయం తొందరల్లోనే ఉందన్నారు. పాలించే అర్హత మంత్రులకు లేదని, తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ప్రాణం విలువ రూ. 5 లక్షలా అంటూ ప్రశ్నించారు. పరిపాలన తెలియని వారు ఉన్నారని ఆరోపించారు.