
అడ్డగోలు వసూళ్ల రెవెన్యూ!
నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో ప్రతి సేవకో రేటు అడిగినంత ఇవ్వకపోతే ముందుకు కదలని ఫైళ్లు
నెహ్రూనగర్: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో రెవెన్యూ అధికారులు రిజెక్ట్ చేసిన ఫైళ్లు ఏకంగా 5,075 కావడం గమనార్హం. గుంటూరు నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను పేరు మార్పు, కొత్త ఇంటి పన్ను, వీఎల్‌టీ, ఇతర పనుల నిమిత్తం మొత్తం వచ్చిన దరఖాస్తులు 14,936. ఏ దరఖాస్తు అయినా 15 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ, గడువు పూర్తయిన తరువాత దరఖాస్తులు (బీయాండ్ ఎస్‌ఎల్‌ఏ) ఆమోదించినవి 1,600 ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ రిజెక్ట్ కొట్టగానే సదరు దరఖాస్తుదారుడు రెవెన్యూ సిబ్బందిని కలిసి ప్రసన్నం చేసుకుంటే పనులు పూర్తి అవుతున్నట్లు పరిస్థితి నెలకొంది.
ఇవిగో నిదర్శనాలు...
●పొన్నూరు రోడ్డులోని ఓ ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టారు. సదరు స్థలానికి వీఎల్‌టీ (ఖాళీ స్థల పన్ను) ఉంది. ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత దానిని రెసిడెన్షియల్‌లోకి మార్చాలంటే ఖర్చు అవుతుందని రెవెన్యూ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పన్ను నుంచి రెండున్నర సంవత్సరాలపాటు వెనక్కి వేసే వెసులుబాటు ఉంటుంది. వారు అడిగింది ఇవ్వకపోయే సరికి పన్ను ఉన్నదానికన్నా అదనంగా పెంచడంతోపాటు సంవత్సరం వెనక్కి వేశారు.
●అరండల్‌పేటలో ఓ ఇంటికి టైటిట్ ట్రాన్స్‌ఫర్ (టీటీపీ) చేయడానికి రూ.లక్ష డిమాండ్ చేశారు. విషయం చివరికి కార్పొరేషన్ కార్యాలయంలో తెలియడంతో కొంచెం వెనక్కి తగ్గారు.
●సంజీవయ్యనగర్‌లో ఓ వ్యాపార సంస్థకు కమర్షియల్ ట్యాక్స్ వేయాల్సి ఉండగా.. సదరు వ్యాపారస్తుల నుంచి మామూళ్లు తీసుకుని రెసిడెన్షియల్ ట్యాక్స్ వేసేందుకు దరఖాస్తు అప్పీలు చేశారు. దీనిని గమనించిన ఆర్వో సదరు దరఖాస్తును రిజెక్ట్ చేశారు.
●బృందావన్ గార్డెన్స్‌లో ఇంటి పన్ను పేరు మార్పు కోసం దరఖాస్తు వచ్చింది. కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది ఆ ఫైల్ తమ వారిదేనని, కొంచెం చేసి పెట్టాలని కోరినప్పటికీ డబ్బులు ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఆ పని కోసం వారు కూడా డబ్బులు సమర్పించుకున్న పరిస్థితి.
●కొత్తపేటలో కూడా టైటిల్ ట్రాన్స్‌ఫర్ కోసం దరఖాస్తు వస్తే దానిని సకాలంలో పూర్తి చేయలేదు. సదరు దరఖాస్తుదారుడు బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు.
కనీసం రూ.10 వేలు ఇవ్వాల్సిందే..
కొత్త ఇంటి పన్ను సదరు స్థల విస్తీర్ణం బట్టి రూ.10 వేల నుంచి రూ. 50 వేలకుపైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టైటిల్ ట్రాన్స్‌ఫర్‌కు సదరు భవనం స్థితిని బట్టి రూ.50 వేలకుపైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నేరుగా ఫిర్యాదు చేయండి
రెవెన్యూ సెక్షన్‌లో సర్వీస్ రిక్వెస్ట్ కోసం సిబ్బంది ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా ఫిర్యాదు చేయండి. సంబంధిత సిబ్బందిపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– చల్లా ఓబులేసు, అదనపు కమిషనర్