అవకాశం లేకనే ఆ బిర్యానీ తిన్నాం.. | - | Sakshi
Sakshi News home page

అవకాశం లేకనే ఆ బిర్యానీ తిన్నాం..

Oct 14 2025 7:43 AM | Updated on Oct 14 2025 7:43 AM

అవకాశం లేకనే ఆ బిర్యానీ తిన్నాం..

అవకాశం లేకనే ఆ బిర్యానీ తిన్నాం..

అప్పటి నుంచే వాంతులు, విరేచనాలు విచారణకు వచ్చిన ఉన్నతాఽధికారుల ఎదుట విద్యార్థుల ఆవేదన

ప్రత్తిపాడు: పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలోని బీసీ బాలుర హాస్టల్‌లో 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీసీ సంక్షేమశాఖ స్టేట్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ డి.చంద్రశేఖర్‌రాజు, వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ బి.సుబ్రమణ్యేశ్వరిలు హాస్టల్‌లో విచారణ నిర్వహించారు. అధికారులు విద్యార్థులను ప్రశ్నించగా అవకాశం లేకనే బిర్యానీ తిన్నామని చెప్పారు. తాజాగా ఉందా, వాసన వస్తుందా అని అడుగగా తాజాగా లేదని తెలిపారు. హాస్టల్‌లోని వంటగది, విద్యార్థులు ఉండే రూమ్‌లు, బెడ్‌లు, వంట పాత్రలు, తాగు నీరు, తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్‌ వాతావరణం అపరిశుభ్రంగా, గదుల్లో బూజుపట్టి ఉండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదేమని సిబ్బందిని ప్రశ్నించారు. ఇంత ఘటన జరిగిన తరువాత కూడా హాస్టల్‌ ఇలా ఉంటే ఎలాగని ఆగ్రహించారు.

బయట నుంచి ఫుడ్‌ తెచ్చి ఎలా పెడతారు?

సస్పెన్షన్‌కు గురైన హాస్టల్‌ వార్డెన్‌ మార్కండేయులును పిలిపించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అసలు బయట నుంచి ఫుడ్‌ను లోపలకు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. బయట ఫుడ్‌ అనుమతించకూడదు కదా అని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటం వలనే ఘటన చోటుచేసుకుందన్నారు.

అందువలనే ఫుడ్‌ పాయిజన్‌ అయ్యేది..

వంట మనిషి కల్పనతోనూ మాట్లాడారు. భోజనం వంట గది అపరిశుభ్రంగా ఉంటే చూసుకోవాలి కదా అని మండిపడ్డారు. పరిశుభ్రతకు సంబంధించి పలు సూచనలు అందించారు. వంట పాత్రలు శుభ్రంగా లేకున్నా కూడా ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే అవకాశాలు ఉంటాయని సుబ్రమణ్యేశ్వరి స్పష్టం చేశారు. అనంతరం బీసీ సంక్షేమశాఖ స్టేట్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ డి.చంద్రశేఖర్‌ రాజు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు వెళ్లి అక్కడ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పరిశీలించారు. తదనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉంది, ఘటన ఎలా జరిగింది, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంట జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి మయూరి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement