మహనీయుల సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

మహనీయుల సేవలు చిరస్మరణీయం

Oct 4 2025 6:38 AM | Updated on Oct 4 2025 6:40 AM

గుంటూరు వెస్ట్‌: దేశాభివృద్ధి కోసం మహనీయులు చేసిన సేవలను ఎప్పటికీ మరులేమని జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా తెలిపారు. గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిల జయంతి సందర్భంగా గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, నగర పాలక కమిషనర్‌ పులి శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కె.ఖాజా వలి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్‌, జిల్లా అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమాజంలో ఇంతటి స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నామంటే మహానుభావుల త్యాగ ఫలమేనన్నారు. ప్రతిఫలం ఆశించకుండా వారు చేసిన సేవలు నేటి యువత తెలుసుకుని, వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు.

సాగును లాభసాటిగా మార్చాలి

వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పెట్టుబడులు తగ్గి రైతులకు లాభాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రాథమిక రంగాల శాఖలు నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తూ లాభదాయకత పెరిగేలా చూడాలని ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలను ముందుగా గుర్తించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ అయితా నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు సేవ కేంద్రాల స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించామని తెలిపారు. పంటల వారీగా సమస్యలను గుర్తించామని చెప్పారు. రైతులు మొక్కజొన్న, మినప పంటలకు మారుతున్నారని తెలిపారు. పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి. సత్యనారాయణ సీపీఓ శేషశ్రీ, జిల్లా మత్స్య శాఖ అధికారి పి.ఎన్‌.కిరణ్‌ కుమార్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

స్వచ్ఛ అవార్డులు రావడం అభినందనీయం

గుంటూరు జిల్లాకు స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు 5 రాష్ట్ర స్థాయి, 48 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని తెలిపారు. వివరాలను స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర పోర్టల్‌లో పొందుపరిచామన్నారు. అధికారులు, సిబ్బంది కృషిని అభినందించారు.

వాయు నాణ్యతాప్రమాణాలు పెంచండి

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వాయు నాణ్యతాప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం ద్వారా జీఎంసీ పరిధిలో చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లా స్థాయి అమలు కమిటీతో కలెక్టర్‌ సమీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెడికల్‌ క్లబ్‌ రోడ్డు, పొన్నూరు రోడ్డు బీటీ పనులకు, మియావాకీ ప్లాంటేషన్‌కు రూ.3.56 కోట్లతో వచ్చిన ప్రతిపాదనలకు ప్రాథమికంగా ఆమోదం తెలిపారు.

అనుమతులు ఇవ్వండి

పరిశ్రమలు, సేవా రంగాల్లో అనుమతులు సత్వరం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సెకండరీ, సేవా రంగాలలో జిల్లాలో ఉత్తమ ప్రగతి రావాలన్నారు.

అభివృద్ధిలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ కీలకం

నియోజకవర్గ స్థాయిలో ‘యంగ్‌ ప్రొఫెషనల్స్‌’ ఆ ప్రాంత అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని జిల్లా కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, యంగ్‌ ప్రొఫెషనల్స్‌ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. యువత విజ్ఞానం వృథా కాకుండా సమాజ అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలన్నారు. జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, వ్యవసాయ శాఖ జేడీ అయితా నాగేశ్వర రావు, గుంటూరు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్‌ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement