
వైభవంగా చండీకల్యాణం
అమరావతి: ప్రముఖ శైవక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండిక సమేత అమరేశ్వరస్వామి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి చండీకల్యాణం వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవారికి, స్వామివారికి ఎదుర్కోల మహోత్సవం జరిగింది. ఆలయంలోని వెంకటాద్రినాయుని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని ఉంచి ఆలయ అర్చకులు కౌశిక చంద్రశేఖరశర్మ యాజ్ఞీక పర్యవేక్షణలో అర్చకులు విఘ్నేశ్వర పూజ, రక్షాబంధనం,పుణ్యహవాచనం, కన్యాదానం, శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. ఏటా రెండుసార్లు అనగా మహాశివరాత్రి, దసరాకు కల్యాణం నిర్వహించటం సంప్రదాయమని అర్చకులు పేర్కొన్నారు.
రోడ్డు నిర్మాణంలో నాణ్యతాలోపాలు
నాదెండ్ల: సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యతాలోపాలు నిజమని తేలటంతో సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 2017–18లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు రూ.40 లక్షల పంచాయతీరాజ్ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మించారు. పనులు నాసిరకంగా ఉన్నాయంటూ 2020లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాణాలు పాటించలేదని నిర్ధారించారు. అప్పటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా వ్యవహరించిన కేశవరావుకు చార్జ్‌మెమో జారీ చేశారు. కాంట్రాక్టర్‌కు చెల్లించిన బిల్లులో కోత విధించారు. 2024లో కేశవరావు ఉద్యోగ విరమణ చేసినందున ఆయన పింఛను నుంచి మూడేళ్లపాటు 15 శాతం చొప్పున జరిమానాగా కోత విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.