
రక్తదానం ఎంతో గొప్పది
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రాణాలను కాపాడే రక్తదానం ఎంతో గొప్ప సేవా కార్యక్రమం అని, ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ కె.విజయలక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జెడ్పీ ప్రాంగణంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ గత 15 రోజులుగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అనేక కళాశాలల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి యువతను రక్తదానం వైపు మళ్లే రెడ్ క్రాస్ కృషి చేసిందని, రెడ్ క్రాస్ చేస్తున్న సేవలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీ సుందరాచారి మాట్లాడుతూ జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయటం అభినందనీయమని అన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించిన మాస్టర్ మైండ్స్, టీజేపీస్, మలినేని ఇంజనీరింగ్ కాలేజ్, సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజ్ ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ పి.రామచంద్ర రాజు, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్షుడు నంబూరు కృష్ణమూర్తి, తెనాలి రెడ్ క్రాస్ చైర్మన్ ముమ్మనేని భానుమతి, డాక్టర్ శ్రవణ్ కుమార్, రోటరీ క్లబ్ సభ్యులు, రెడ్ క్రాస్ వలంటీర్లు పాల్గొన్నారు.