
అలరించిన ‘ఆదికవి నన్నయ భట్టు’
●కొనసాగిన వీణా అవార్డ్స్ – 2025
●ముగిసిన పద్య నాటికల అంకం
తెనాలి: కళల కాణాచి, తెనాలి, ఆర్‌ఎస్‌ఆర్ గ్రీన్‌వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ఇక్కడ జరుగుతున్న ‘వీణా అవార్డ్స్–2025’ జాతీయస్థాయి పంచమ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఐదోరోజైన బుధవారం ఉదయం శ్రీశ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, విజయనగరం వారు ప్రదర్శించిన ‘ఆదికవి నన్నయ్య భట్టు’తో పద్యనాటకాలు ముగిశాయి. సాంఘిక నాటక/నాటికలు కొనసాగుతున్నాయి. ఆదికవి నన్నయ భట్టు ఇతివృత్తం తెలిసిందే. రాజరాజ నరేంద్రుడికి ఇచ్చిన మాట కోసం ఆస్థాన కులగురువు నన్నయ భట్టు మహాభారతాన్ని తెలుగులో రచించటానికి పూనుకుంటాడు. సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదింటానికి పండితలోకం అనుమతించదు. అందుకు తగిన వ్యాకరణం కూడా లేదని నిరసిస్తుంది. దీంతో ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించి, మహాభారత అనువాదానికి పూనుకుంటాడు నన్నయ. భార్య వియోగం, రాజు మరణం సహా అనేక అవాంతరాలు ఎదురవుతాయి. చివరకు ఆది, సభాపర్వాలు మాత్రమే రచించి, అనూహ్యంగా పరలోకం చేరుకుంటాడు. శారదా ప్రసన్న రచనకు ఈపు విజయకుమార్ దర్శకత్వం వహించారు. నన్నయ భట్టుగా కె.సూర్యనారాయణ, నారాయణభట్టుగా ఎం.సుబ్రహ్మణ్యం, సోమిదమ్మగా కేవీ పద్మావతి, రాజరాజ నరేంద్రుడుగా వై.సత్యం పాత్రోచితంగా నటించారు. మధ్యాహ్నం జయకళానికేతన్, విశాఖపట్నం వారి ‘సిరికేళి’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. వేగి పార్వతి సూర్యనారాయణ రచనకు కె.వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో కృష్ణారావు, హేమ, రాజేశ్వరి, కె.వెంకటేశ్వరరావు, త్రినాథ్ నటించారు. సాయంత్రం శ్రీసద్గురు కళానిలయం, గుంటూరు వారి ‘నాన్న’ నాటికను ప్రదర్శించారు. మాడభూషి దివాకర్‌బాబు రచనకు బసవరాజు జయశంకర్ దర్శకత్వం వహించారు. పరమాత్ముని క్రియేషన్స్, భాగ్యనగరం, హైదరాబాద్ వారి ‘ఎక్కడో...ఏదో’ నాటిక, చివరగా కళానికేతన్, వీరన్నపాలెం వారి ‘దీపం కింద చీకటి’ నాటికను ప్రదర్శించారు.
నూతలపాటికి వేదగంగోత్రి వరప్రసాద్ పురస్కారం
తెనాలి: స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో జరుగుతున్న వీణా అవార్డ్స్–2025 పోటీల్లో అయిదోరోజైన బుధవారం రాత్రి వేదగంగోత్రి వరప్రసాద్ జాతీయ రంగస్థల నిర్వాహక పురస్కారాన్ని సత్తెనపల్లికి చెందిన ప్రగతి కళామండలి రథసారథి, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు నూతలపాటి సాంబయ్యకు ప్రదానం చేశారు. పొన్నూరు కళాపరిషత్ నిర్వాహకుడు ఎస్.ఆంజనేయులు నాయుడు అధ్యక్షత వహించారు. కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీమాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారిచే అవార్డును అందజేశారు. కార్యక్రమంలో వేదగంగోత్రి ఫౌండేషన్, విజయవాడ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.రవితేజ, ప్రముఖ నాటకరంగ విశ్లేషకుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్‌ల సమాఖ్య అధ్యక్షుడు బుద్దాల వెంకట రామారావు, కళల కాణాచి గౌరవ సలహాదారుడు వేమూరి విజయభాస్కర్, సహాయ కార్యదర్శి అయినాల మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా జాతీయస్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్న కళల కాణాచికి ప్రభుత్వం తరఫున నిధి ఏర్పాటుకు తాను సిఫార్సు చేయనున్నట్టు రాజకుమారి ప్రకటించారు.

అలరించిన ‘ఆదికవి నన్నయ భట్టు’