
నేడు చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు
మళ్లీ ఆ ఇద్దరే అధ్యక్ష పదవికి పోటీ
నగరంపాలెం(గుంటూరువెస్ట్): ఇండియన్ చాంబర్ ఆఫ్ కామ ర్స్ (ఐసీసీ) ఎన్నికల పోటీ రసవత్తరంగా మారింది. ఎన్నడూ లేని విధంగా గతేడాది నుంచే ఐసీసీలో ఎన్నికల ప్రక్రియకు కూటమి ప్రభుత్వం తెరలేపింది. దీంతో అధ్యక్ష పదవి కోసం ఇరువర్గాల ప్యానెళ్లు బరిలోకి దిగాయి. నువ్వా–నేనా అనే రీతిలో పోటీ పడుతున్నాయి.
గతంలో అధ్యక్షునిగా ఆతుకూరి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. దాదాపు 34 ఏళ్లపాటు ఆయన చాంబర్ ఆధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. చాలాసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఉన్న రికార్డులను చెరిపేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోటీ చిచ్చు రేపింది. దీంతో గతేడాది అధ్యక్ష పదవికి టీడీపీ నేతలు ఏల్చూరి వెంకటేశ్వర్లు, రంగా బాలకృష్ణలు పోటీపడ్డారు. చివరకు కూటమి నేతలంతా ఒక్కటై, ఏల్చూరి వెంకటేశ్వర్లకు మద్దతుగా శిబిరాలు నిర్వహించి, అధ్యక్ష బరిలో ఉన్న టీడీపీ నేత బాలకృష్ణను ఓడించారు.
ఆది నుంచి చాంబర్‌లో చురుగ్గా ఉంటున్న రంగా బాలకృష్ణను విస్మరించి, ఏల్చూరి వైపు కూటమి నాయకులు మొగ్గుచూపడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.
ప్రస్తుతం జరిగే ఎన్నికల్లోనూ ఆ ఇద్దరి మధ్యనే మళ్లీ పోటీ నెలకొనడం రసకందాయంగా మారింది. ఈసారైనా గెలుపొందాలని బాలకృష్ణ ప్యానెల్ పావులు కదుపుతోంది. రెండోసారి కూడా అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని ఏల్చూరి ప్యానెల్ ప్రయత్నాలు చేస్తోంది.
3,200 మందికి సభ్యత్వం
గుంటూరు నగరంలోని జిన్నాటవర్ కూడలిలో ఉన్న ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎన్నికలు జరుగుతాయి. సుమారు 3,200 మంది వ్యాపారులకు సభ్యత్వం ఉన్నట్లు కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం పది గంటలకు మొదలయ్యే ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. అదే రోజు రాత్రి ఓట్ల లెక్కింపు నిర్వహించి గెలుపొందిన అభ్యర్థిని ప్రకటిస్తారు.