నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : ఈ నెల 22 నుంచి చుట్టుగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 22వ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. దేవస్థానంలో శనివారం మహోత్సవాల గోడప్రతులను కమిటీ సభ్యులతో కలసి ఆమె ఆవిష్కరించారు. వచ్చేనెల రెండో తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, అడకా పద్మావతి, తుమ్మల నాగేశ్వరరావు, కుమ్మర క్రాంతి కుమార్, అంగడి శ్రీనివాసరావు, అడకా శ్రీనివాసరావు, పెద్ద బుజ్జి పాల్గొన్నారు.
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో శనివారం రాత్రి ఉరుములతో భారీ వర్షం కురిసింది. నగర ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. అరండల్‌పేటలో పైపులైను కోసం తవ్విన గుంతల పక్కన మట్టి రోడ్డుపైనే ఉండటంతో వర్షం నీటితో చిత్తడిగా మారింది. పలువురు పాదచారులు, వాహన చోదకులు జారిపడి గాయపడ్డారు. డొంకరోడ్డులో మూడు వంతెనల వద్ద వర్షపునీటితో రాపోకపోలకు అంతరాయం ఏర్పడింది. కంకరగుంట ఫ్‌లైఓవర్ వద్ద అండర్‌పాస్ పూర్తిగా నీటి మయం కావడంతో అక్కడ భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే దసరా ఉత్సవాలను అపహాస్యం చేయటానికి, అమ్మవారి ప్రతిష్టను, ఖ్యాతిని తగ్గించడానికి కూటమి నేతలు విజయవాడ ఉత్సవ్ పేరుతో అడ్డగోలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ విమర్శించారు. తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘దసరా ఉత్సవాల పేరుతో కూటమి నేతలు చేస్తున్న కార్యక్రమాల్లో అమ్మవారిని గుర్తు పెట్టుకుంటారా? మీ సినిమా పాటలు గుర్తు పెట్టుకుంటారా?’ అని ప్రశ్నించారు. విజయవాడ ఉత్సవ్ పేరుతో రూ.100 కోట్లు దోచుకోవడానికి ఎంపీ కేశినేని చిన్ని తదితర నేతలు పథకం పన్నారని దుయ్యబట్టారు. శ్రేయస్ మీడియాతో కుదుర్చుకున్న ఒప్పందం ఎంతో విజయవాడ ఎంపీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. విజయవాడలో వందేళ్లగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని గుర్తుచేశారు. సంక్రాంతి రోజు విజయవాడ ఉత్సవ్ నిర్వహించొచ్చు కదా? అని ప్రశ్నించారు. హిందూ భక్తులను దోచుకోవడానికి సీఎం చంద్రబాబు అధికారిక ఉత్తర్వులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు వ్యామోహంతో విష సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడ ఉత్సవ్‌కు పర్యటన శాఖ సహకారం, నిధులు ఇస్తోందని కూటమి నేతలు చెప్పటం సిగ్గుచేటన్నారు. బందరు గొడుగుపేట వెంకటేరస్వామికి గొల్లపూడిలో ఉన్న భూముల్లో విజయవాడ ఉత్సవ్ ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. అమ్మవారి దసరా ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రజాప్రతినిధులు విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు తప్ప, అమ్మవారి దసరా ఉత్సవ్ పత్రికలు ఇచ్చారా అని ప్రశ్నించారు.
దేవీశరన్నవరాత్రుల గోడ ప్రతుల ఆవిష్కరణ
దేవీశరన్నవరాత్రుల గోడ ప్రతుల ఆవిష్కరణ