
నీటి కత్తి
వర్షాలకు ప్రధాన, అంతర్గత రహదారులు జలమయం వాహనదారులు, ప్రజలకు అవస్థలు డ్రెయిన్ల నిర్వహణ అస్తవ్యస్తం పట్టించుకోని పాలకులు ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కరువు వరద కట్టడికి చర్యలు చేపట్టాలని ప్రజల వినతి
గుంటూరు నెత్తిన
చిన్న వర్షాలకే నీట మునుగుతున్న నగరం
నెహ్రూనగర్: రోజు రోజుకీ అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరం వర్షం పడితే చాలు మునిగిపోతోంది. రాజధాని ప్రాంతంలో ప్రముఖమైన నగరంలోని పలు ప్రాంతాల్లోని వీధులన్నీ జలమయంగా మారుతున్నాయి. నగరపాలక సంస్థ కార్యాలయం కూడా మునుగుతుందంటే దీనికి కారణం పాలకుల అసమర్థతే అని చెప్పుకోవాలి. వర్షం పడితే చాలు ప్రధాన రోడ్లన్నీ మోకాళ్ల లోతు దాకా వర్షపు నీటితో నిండిపోతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు నీళ్లలో నాని మొరాయిస్తున్నాయి. మరమ్మతులు చేయించుకోవడానికి తడిసి మోపెడవుతోంది. మరో పక్క ఇళ్లలోకి నీరు చేరుతోంది. గృహోపకరణాలు పాడైపోతుండటంతో సామాన్యులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
తూతూమంత్రంగా డ్రెయిన్లలో పూడికతీత పనులు
గుంటూరు నగరంలో 210 కిలోమీటర్ల మేర డ్రెయిన్లు విస్తరించి ఉన్నాయి. వీటిలో మేజర్ 125.28 కిలోమీటర్లు, మీడియం 67.41 కిలోమీటర్లు, మైనర్ 16.25 కిలోమీటర్లుగా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ కింద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డ్రెయిన్లలో పూడికతీత పనులు చేపడుతుంటారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ అధికారులు రూ.4.78కోట్లతో పనులు ప్రారంభించారు. అయితే, కాంట్రాక్టర్లు ౖపైపెన పూడిక తీయడం, బిల్లు పెట్టుకోవడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమన్వయం కరువు
మొండిగేటు అవుట్ ఫాల్ డ్రెయిన్ విస్తరణకు రైల్వేశాఖకు నగరపాలక సంస్థ నుంచి ఖర్చును చెల్లించినప్పటికీ ఫలితం లేదు. రైల్వే అధికారులను సమన్వయం చేసుకుని డ్రెయిన్ విస్తరణ చేయడంలో నగరపాలక సంస్థ అధికారులు విఫలం అవుతున్నారు.
ఆక్రమణల తొలగింపుకు అడ్డుపడుతున్న ఎమ్మెల్యేలు?
ఎమ్మెల్యే అండ చూసుకుని నగరంలో ఎటూ చూసిన డ్రెయిన్లను ఆక్రమించుకుని నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో డ్రెయిన్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇటీవల కమిషనర్ తన రోజువారీ పర్యటనలో ఆక్రమణలు తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు.