
అతిసారం.. ప్రాణాంతకం
లక్షణాలు ఇవి...
జీర్ణవ్యవస్థ పనితీరు అస్తవ్యస్తంగా ఉండి వాంతులు, విరేచనాలు నీళ్లు, నీళ్లుగా
అవుతాయి.
కడుపులో మెలిపెట్టినట్లు నొప్పి
ఉంటుంది.
నీరసం, వికారం, వాంతులు, శరీరంలో లవణాలు పోయి పిక్కల నొప్పులు వస్తాయి.
మనం తాగే నీరు శరీరం నుంచి అధిక మొత్తంలో బయటకు వెళ్లిపోతే డీహైడ్రేషన్ ఏర్పడి ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది.
డీహైడ్రేషన్‌లో నాడి వేగంగా లేదా బలహీనంగా కొట్టుకోవడం లేదా ఒక్కోసారి అసలు తెలియపోవడం ఉంటుంది.
నీరసం, నోరు, నాలుక, పిడచకట్టుకు పోవడం, శరీరం ఎండిపోవడం, ఒక్కోసారి మూత్రం అసలు రాకపోవటం లేదా చాలా తక్కువగా రావటం లేదా ముదురు పసుపు రంగులో వస్తుంది.
వయస్సుతో సంబంధం లేకుండా డీహైడ్రేషన్ వస్తుంది. దీనివల్ల పిల్లలకు, వృద్ధులకు ఎక్కువ ప్రమాదం.
కాచి చల్లార్చిన నీరు తాగాలి
గుంటూరు మెడికల్: వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం (డయేరియా) ముఖ్యమైంది. సకాలంలో వైద్యం చేయించని పక్షంలో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. గుంటూరు నగరంలో మంగళ, బుధవారాల్లో 25 మంది వ్యాధి బారిన పడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఏటా వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అతిసార వ్యాధి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత ఏడాది గుంటూరు నగరం శారదా కాలనీలో 326 కేసులు నమోదు కాగా, ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. చేబ్రోలు పీహెచ్‌సీ పరిధిలోని మంచాల గ్రామంలో 62 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇటీవల నగరంలో కేసులు వస్తున్న నేపథ్యంలో వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం
వ్యాధి సోకడానికి కారణాలు
విరోచనాలు నీళ్లుగా, పలచగా అవుతుంటే డయేరియా(అతిసార వ్యాధి) అంటారు. వైద్య పరిభాషలో దీన్ని గ్యాస్ట్రో ఎంటైరెటిస్‌గా పిలుస్తారు. ఈ వ్యాధి జీర్ణవ్యవస్థకు సోకుతుంది. నీళ్ల విరేచనాలు నూటికి 70శాతం వైరస్ క్రిముల వల్ల వస్తాయి. కలుషితమైన నీటిని తాగడం వల్ల, మలం మీద వాలిన ఈగలు ఆహార పదార్థాలపై వాలిన తర్వాత తినడం ద్వారా వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించి విరేచనాలవుతాయి.
పిల్లలకు ఎక్కువ జాగ్రత్తలు
తీసుకోవాలి
డయేరియా వల్ల పెద్దవారికంటే పిల్లలకు ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. దాహం పెరిగితే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తాగించాలి. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో వీటిని ఉచితంగా అందిస్తారు. ఒక ప్యాకెట్ పౌడర్‌ను లీటర్ నీటిలో కలిపి పిల్లలతో తాగించాలి. విరోచనాలు అయ్యేవారికి కారం, మసాలావంటి ఘాటు పదార్థాలు పెట్టకూడదు. డయేరియా తగ్గే వరకు వైద్యుల సలహా ప్రకారం మందులు, ఆహారం అందించాలి.
ఉచితంగా వైద్య సేవలు
వర్షాకాలంలో కేసులు నమోదయ్యే దృష్ట్యా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. బాధితులకు చికిత్స అందించేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు, సైలెన్లు, అన్ని అందుబాటులో ఉంచాం. డయేరియా సోకిన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ముందస్తుగా గుర్తించి నివారణ చర్యల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అతిసార వ్యాధి బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం.
–డాక్టర్ కొర్రా విజయలక్ష్మి , డీఎంహెచ్‌ఓ, గుంటూరు
డయేరియా సోకిన వారికి ద్రవ రూపంలో ఉండే ఆహారం అందజేయాలి. మజ్జిగ, పాలు, బార్లీ గంజి, పలచగా తయారు చేసిన సగ్గు బియ్యం, రాగి జావ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, సోయాబీన్స్ రసం, ఇతర పళ్ల రసాలు ఇవ్వొచ్చు. మలమూత్ర విసర్జన పిదప, భోజనం చేసే ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం చాలా ఉత్తమం. ఇంట్లో వైద్యాలు, మందుల షాపుల వద్దకు వెళ్లి మందులు తెచ్చుకోవడం చేయవద్దు. డయేరియా వచ్చినప్పుడు అర్హత ఉన్న వైద్య నిపుణుడి వద్దకు వెళ్లాలి.
– డాక్టర్ షేక్ నాగూర్‌బాషా, గ్యాస్ట్రో
ఎంట్రాలజిస్ట్, గుంటూరు

అతిసారం.. ప్రాణాంతకం

అతిసారం.. ప్రాణాంతకం