
సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గుంటూరు వెస్ట్: విపరీతమైన పనిభారంతో పాటు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్ కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వే విధుల నుంచి విముక్తి కలిగించి మాతృ శాఖలకు అప్పగించాలని విన్నవించారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, బకాయిలు ఇప్పించాలని కోరారు. సచివాలయ ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌కు అప్‌గ్రేడ్ చేయాలని, స్పష్టమైన సర్వీస్ రూల్స్ రూపొందించి పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బదిలీలకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలతో జీవో ఇవ్వాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌కు విన్నవించారు. కార్యక్రమంలో కోశాధికారి ధనలక్ష్మి, వైస్ చైర్మన్ మధులత, మరియదాసు, జేఏసీ నాయకులు మధు, సతీష్, మహేష్, రాజారావు, బాషా, హిదాయత్, పవన్, ప్రసాద్, భరత్, సరోజిని, దీప్తి, ప్రశాంతి, గీత పావని, రాధిక పాల్గొన్నారు.
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
ఏర్పాటు చేయాలి
జిల్లాలో గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం నాయకులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ సంఘ నాయకులతో కలసి జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా గురువారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. చాలా కాలం నుంచి సమావేశం నిర్వహించలేదని, సమస్యలు చెప్పుకునే అవకాశం తమకు రాలేదని పేర్కొన్నారు. తాము ప్రభుత్వంతో కలిసి ప్రజలకు ఉత్తమ సేవలందించేందుకు ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. న్యాయమైన తమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కరిముల్లా షాఖాద్రి, సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ, కోటా సాహెబ్, జిల్లా కోశాధికారి పోతురాజు, నగర శాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలత, కార్యదర్శి సుమిత్రాదేవి, షబానా, అరుణ కుమారి, రమణి పాల్గొన్నారు.