
కౌలు రైతులకు చట్టమే ఆటంకం
రైతు సంఘం సీనియర్ నేత వై.కేశవరావు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వటానికి గత ప్రభుత్వం తెచ్చిన చట్టమే ఆటంకంగా ఉందని రైతు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకోవాలంటే దరఖాస్తు ఫారంలో భూ యజమాని సంతకం ఉండాలనే నిబంధన విధించడం వల్ల గుర్తింపు కార్డు దక్కట్లేదని తెలిపారు. గుంటూరు కొరిటెపాడు రామన్నపేటలోని జనచైతన్య వేదిక హాలులో మంగళవారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ 2011 కౌలుదార్ల చట్టాన్ని సవరించి, గత ప్రభుత్వం 2019లో తెచ్చిన చట్టంతో కౌలు రైతులకు గుర్తింపుకార్డులు దక్కటమే గగనమైందని తెలిపారు. ఈ చట్టాన్ని సవరిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన టీడీపీ గెలిచాక సవరణ ముసాయిదాపై ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేసి, ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పడేశారని తెలిపారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ కౌలు రైతుల సమస్య నేడు దేశంలో చాలా పెద్దదని, వారి సంక్షేమాన్ని పట్టించుకోకపోతే అశాంతి, అలజడి పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి, ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు , డీబీఎఫ్ వ్యవస్థాపకులు కొరివి వినయ్‌కుమార్, కిసాన్ ఫౌండేషన్ నాయకులు సూరయ్య చంద్ర, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు తదితరులు ప్రసంగించారు.