
● కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు
అక్రమ కేసుతో ఎంపీపీని వేధించడం దారుణం
యాదవ యువజన రాష్ట్ర అధ్యక్షుడు చింతలపూడి మురళీకృష్ణ
పొన్నూరు: కూటమి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడటం దారుణమని ఆంధ్రప్రదేశ్ యాదవ యువత రాష్ట్ర అధ్యక్షులు పొన్నూరు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు చింతలపూడి మురళీకృష్ణ ఆరోపించారు. పెదకాకాని మండల పరిషత్ అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయ కులు తుల్లిమిల్లి శ్రీనివాసరావుపై అక్రమ కేసుతో ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఎంపీపీ ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా జలకళ ద్వారా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే అక్రమంగా కేసు పెట్టి వేధిస్తున్నట్లు స్పష్టమవుతోందని వెల్లడించారు. అధికారులపై ఎలాంటి చర్యలు లేకుండా శ్రీనివాసరావుని మాత్రమే బాధ్యుడిని చేయడం దారుణమన్నారు. రాజకీయంగా అణచివేసే పన్నాగంలో భాగంగా బలహీన వర్గా లను టార్గెట్ చేసి వేధింపులకు గురిచేయడం హేయమైన చర్య అన్నారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే యాదవ కులానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలోని యాదవులంతా ఒక్కటై కూటమిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని అన్నారు. నిరాధారమైన ఆరోపణలతో ఎంపీపీపై పెట్టిన అక్రమ కేసును తీసివేసే వరకూ ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
జ్వరంతో ‘నారాయణ’ విద్యార్థి మృతి
లక్ష్మీపురం: నారాయణ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థి జ్వరంతో బుధవారం మృతి చెందాడు. వివరాలు.. ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, బోనపల్లె గ్రామానికి చెందిన ఏలూరి వెంకట సుబ్బయ్య, సువర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకట నారాయణ(15), రెండో కుమారుడు దీక్షిత్‌లు గుంటూరులోని నారాయణ విద్యాసంస్థలో చదువుతున్నారు. వెంకట నారాయణ పలకలూరు క్యాంపస్‌లో పదో తరగతి, దీక్షిత్ పట్టాభిపురం ఐఐటీ క్యాంపస్‌లో పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరు హాస్టల్‌లోనే ఉంటున్నారు. వెంకట నారాయణ వారం రోజుల నుంచి జ్వరంతో ఉండటంతో ఈ నెల 2వ తేదీన తల్లిదండ్రులు వచ్చి స్వగ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. సోమవారం పలకలూరులోని క్యాంపస్‌లో దిగబెట్టి వెళ్లారు. జ్వరం మళ్లీ రావడంతో మంగళవారం రాత్రి గుంటూరు గుజ్జనగుండ్లలో ఉండే మేనమామ మహేష్‌కు ఫోన్ చేయడంతో బుధవారం ఉదయం సుమారు 6.30 గంటలకు క్యాంపస్‌కు వచ్చి బాలుడిని గుజ్జనగుండ్లలోని తన సోదరి అనసూయ ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత స్థంభాలగరువులోని ఎంజీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేస్తున్న సమయంలో వెంకట నారాయణ మృతి చెందాడు. మధ్యాహ్నం సుమారు 2.20 గంటల సమయంలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వచ్చి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో జోరువానలోనూ స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఆస్పత్రికి చేరుకుని విద్యార్థి కుటుంబానికి అండగా నిలిచారు.
14 మంది బాల కార్మికులు గుర్తింపు
నెహ్రూనగర్: బాల కార్మికులను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎం.బాలు నాయక్‌తో కలిసి బుధవారం చిలకలూరిపేట రోడ్డులో మిర్చి గ్రేడింగ్ చేసే పాయింట్‌లో తనిఖీలు నిర్వహించారు. పని చేస్తున్న 14 మంది బాల కార్మికులను గుర్తించారు. ముగ్గురు యజమానులపై కేసులు నమోదు కోర్టులో ప్రవేశపెట్టారు. బాలలతో ఎక్కడైనా పని చేయిస్తున్నట్లు గుర్తిస్తే 94925 55144 ఫోను నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఎ.గాయత్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం
మంగళగిరి టౌన్: తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని డీఎంహెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. మంగళగిరి నగర పరిధిలోని ఇందిరానగర్ యూపీహెచ్‌సీలో జరుగుతున్న తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు హాజరయ్యారు. ఎయిమ్స్ నర్సింగ్ విద్యార్థులు దృశ్య రూపకం ప్రదర్శించారు. తల్లులకు ప్రోటీన్ పౌడర్, పండ్లు, రాగి జావలను పంపిణీ చేశారు. యూపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. అనూష, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో కె.సరిత, ఎయిమ్స్ సీఎఫ్‌ఎం హెచ్‌ఓడీ డాక్టర్ రాజీవ్, ఎయిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముత్తు వెంకటాచలం, డాక్టర్ సుధీంద్ర తదితరులు పాల్గొన్నారు.