అధికారమే అండగా డీలర్ల దందా! | - | Sakshi
Sakshi News home page

అధికారమే అండగా డీలర్ల దందా!

Aug 7 2025 8:06 AM | Updated on Aug 7 2025 11:47 AM

అధికారమే అండగా డీలర్ల దందా!

అధికారమే అండగా డీలర్ల దందా!

● తాడికొండ మండలంలో పెట్రేగిపోతున్న రేషన్‌ మాఫియా ● నగదు ఇచ్చి నల్లబజారుకు యథేచ్ఛగా బియ్యం తరలింపు ● జేబులు నింపుకొంటున్న టీడీపీకి చెందిన ఇద్దరు డీలర్లు

తాడికొండ: వాస్తవంగా పౌర సరఫరాల శాఖ గోదాము నుంచి సరుకును రేషన్‌ డీలర్లకు తరలించాలంటే వేర్‌ హౌస్‌ గోదాముల నుంచి వచ్చిన బస్తాలను తూకం వేయాలి. అనంతరం డీలర్లకు తూకం వేసి, రేషన్‌ షాపుల వద్ద అప్పగించాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చిన సరుకును నేరుగా వాహనంలోకి ఎక్కించి తూకం వేయకుండానే డీలర్లను కాటాలో నిలబెట్టి తరలిస్తున్నారు. బస్తాకు 2 కేజీలకుపైగా బియ్యాన్ని మాయం చేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఫిర్యాదులు ఇచ్చినా...

ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీన ‘రేషన్‌ బియ్యం సరఫరాలో గోల్‌మాల్‌’ పేరిట ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితం కాగా.. అధికారులు విచారణ చేశారు. సరుకులో కోత విధిస్తున్నారని పలువురు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. మరుసటి నెల నుంచి గోదాము ఇన్‌చార్జి నేతృత్వంలో అదే తంతు కొనసాగుతోంది. ఓ వైపు డీలరుగా, మరోవైపు హమాలీగా విధులు నిర్వహిస్తున్న టీడీపీ వ్యక్తి నేతృత్వంలో గోదాములో జోరుగా రేషన్‌ బియ్యం వ్యాపారం కొనసాగుతోంది. తాడికొండలోని ఓ సీనియర్‌ నాయకుడికి అనుచరుడిని అని చెప్పుకొంటున్న మరో రేషన్‌ డీలరు ఏకంగా తానే రేషన్‌ డీలర్లకు అధ్యక్షుడినని పెత్తనం చెలాయిస్తుండటం గమనార్హం. 5 సంవత్సరాల నుంచి బియ్యం పంపిణీ చేస్తున్న పాయింట్‌ వద్ద సరుకు డెలివరీ ఇవ్వాలని, గతంలో పాడుబడిన భవనంలో ఉన్న పాయింట్‌ వద్ద పెడితే సరుకు ఇస్తామని అధికారులతో చెప్పించాడు. సరుకు డెలివరీ నిలిపి వేయించాడు. గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకుడి జోక్యం చేసుకున్నా గొడవలు ఎందుకంటూనే తన అనుచరుడికి మద్దతు ఇచ్చాడు. దీంతో బాధితుడు కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న పాడుబడిన భవనంలోకే సరుకు దించుకోవాల్సి వచ్చింది. వర్షం పడితే నీరు కారుతుందని మరో గదిలోకి మార్చడంతో తనను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని డీలరు వాపోతున్నారు.

అనుకూలమైన వారికే స్టాకు

అధికార పార్టీ డీలరు ఏకంగా రెండో పాయింట్‌ ఏర్పాటు చేశాడు. లబ్ధిదారులకు నగదు ఇచ్చి ఇద్దరు డీలర్లు సరుకును నల్లబజారుకు తరలిస్తున్నారు. సీనియర్‌ నాయకుడి అండదండలు ఉన్నాయి. తూకంలో తేడాలు, అనుకూలమైన వారికి స్టాకు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తాడికొండలో రేషన్‌ బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు డీలర్ల హవా నడుస్తోంది. పౌర సరఫరాల శాఖ గోదాము మొదలు పంపిణీ వరకు వారి కనుసన్నల్లో అక్రమాలకు జోరుగా సాగుతున్నాయి. పేదల బియ్యంతో వారి జేబులు నింపుకొంటున్నారు.

ఆర్డరు కాపీ పరిశీలిస్తా

దీనిపై పౌర సరఫరాల శాఖ డీటీ దేవరాజును వివరణ కోరగా... సదరు డీలరు రెండో పాయింట్‌ పెట్టుకునేందుకు ఆర్డీవో నుంచి అనుమతి తెచ్చుకున్నట్లు తనకు తెలిపాడన్నారు. అందుకు సంబంధించిన ఆర్డరు కాపీ తన వద్ద లేదన్నారు. తెప్పించుకొని పరిశీలిస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement