
జాతీయ రహదారిపై లారీ దగ్ధం
మంగళగిరి టౌన్: విజయవాడ గుంటూరు జాతీయ రహదారిపై ఓ లారీ దగ్ధమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి నగర పరిధిలోని ఆత్మకూరు బైపాస్‌లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై లారీలో మంటలు చెలరేగాయి. రోడ్డుపై మార్జిన్ పెయింట్ వేసేందుకు ఉపయోగించే లారీగా దీనిని గుర్తించారు. రహదారి పక్కనే ఆపిన లారీలో నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలో ఉన్న నాలుగు సిలిండర్లు పేలడంతో మంటలు ఎక్కువయ్యాయి. పేలుడు శబ్దం ధాటికి సమీపంలో ఉన్న ప్రజలు, వాహన దారులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగే సమయంలో భారీగా ట్రాఫిక్ ఆగిపోవడంతో మంగళగిరి రూరల్ పోలీసులు వచ్చి క్రమబద్ధీకరించారు.