
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం
మంత్రి గుమ్మడి సంధ్యారాణి
గుంటూరు వెస్ట్: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, దీని ప్రాధాన్యతను తెలియజేసే లక్ష్యంతో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్య కుమారిలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన బిడ్డలను కోరుకునే తల్లులు, వారికి పాలు ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, పిల్లలకు రూ. కోట్లు ఖర్చు చేసి బాల సంజీవని అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,065 తల్లులు పిల్లలకు పాలిచ్చే గదులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం మంత్రి తల్లిపాల ఆవశ్యకతపై ప్రత్యేక పోస్టర్లు ఆవిష్కరించారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్లు పి.ప్రవీణ, ఎం.శిరీష, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసూన పాల్గొన్నారు.
వారోత్సవాల్లో పాల్గొనాలి
తెనాలి అర్బన్: తల్లిపాల వారోత్సవాల్లో అందరూ పాల్గొనాలని జిల్లా మలేరియా అధికారి మురళీకృష్ణ సుబ్బరాయణం పిలుపునిచ్చారు. ఆశా డే వేడుకలను పట్టణంలోని జిల్లా వైద్యశాల, సుల్తానాబాద్, పినపాడు, మారీసుపేటలలోని అర్బన్‌హెల్త్ సెంటర్‌లలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తల్లిపాల ఆవశ్యకతను వారోత్సవాల్లో తెలియజేయడం ప్రధాన లక్ష్యమన్నారు. పీపీ యూనిట్ వైద్యాధికారి డాక్టర్ యలవర్తి రాంబాబు మాట్లాడుతూ 12న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 2–19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో వైద్యాధికారి డాక్టర్ ఎస్. రమేష్, మలేరియా అధికారులు చిరసాని ప్రభాకర్‌రెడ్డి, శ్రీకంఠ ఉమాకాంత్, అందె బాలచంద్రమౌళి, జి.రవికుమార్, తిరువీధుల శివరామప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం