
కలెక్టరేట్‌లో ఉద్యోగ సంఘ నేత జన్మదిన వేడుకలు
గుంటూరు వెస్ట్: నిబంధనలు పాటించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు వారు. కార్యాలయ ప్రాంగణాల్లో ప్రయివేటు కార్యక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత గల వారు. కానీ తమ నాయకుడి జన్మదిన వేడుకల సందర్భంగా నిబంధనలు గాలికి వదిలేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో ఉద్యోగులు జన్మదిన శుభాకాంక్షలతో పెద్ద బ్యానర్లు కలెక్టర్ చాంబర్‌కు కూతవేటు దూరంలోనే కట్టించారు. కార్యక్రమానికి కనీసం జిల్లా రెవెన్యూ అధికారి అనుమతి కూడా తీసుకోకపోవడం గమనార్హం. కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇవ్వాలన్నా సామాన్యులకై తే ఐదుగురికి మించి అనుమతివ్వరు. మరి ఉద్యోగ సంఘం నాయకులకు నిబంధనలు వర్తించవా? వారు అన్నిటికీ అతీతులా? అనే సందేహం కలగకమానదు. కనీసం కలెక్టరేట్ కాంపౌండ్‌లో ఇలా జన్మదిన వేడుకలు, బహిరంగ మీటింగ్‌లు పెట్టినప్పుడు అధికారులు కూడా స్పందించపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికే కలెక్టరేట్‌లో అత్యధిక భాగం ఉద్యోగ సంఘాల పేరుతో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేశారు.
అనుమతి తీసుకోలేదు: డీఆర్వో షేక్ ఖాజావలి
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత జన్మదిన వేడుకలకు, బహిరంగ ప్రదేశంలో మీటింగ్‌కుగానీ ఉద్యోగ సంఘ నాయకులు ఎటువంటి అనుమతి తీసుకోలేదు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఇష్టం వచ్చినట్లు కార్యక్రమాలు నిర్వహిస్తామంటే నిబంధనలు అనుమంతిచవు.