
దక్షిణ మధ్య రైల్వే జీఎం తనిఖీలు
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం పగిడిపల్లి – గుంటూరు – కృష్ణా కెనాల్ – విజయవాడ సెక్షన్‌లో తనిఖీలు చేపట్టారు. గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ సుధేష్ణ సేన్, విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఆయా ప్రాంతాల్లో పాల్గొన్నారు. ముందుగా జీఎం ఈ సెక్షన్‌లో రియర్ విండో తనిఖీ నిర్వహించారు. సిగ్నలింగ్, రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పరిశీలించారు. నల్గొండ రైల్వే స్టేషన్‌లో వెయిటింగ్ హాల్, దివ్యాంగుల టాయిలెట్లు, లిఫ్ట్, తాగు నీటి సౌకర్యం వంటి వాటిపై సమీక్షించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. తర్వాత గుంటూరు పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డివిజనల్ కార్యాలయంలో డివిజనల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుంటూరులో మొక్కలు నాటే కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొన్నారు. తర్వాత మంగళగిరి రైల్వే స్టేషన్‌కు వెళ్లి పరిశీలించారు. భద్రతా మార్గదర్శకాలను పాటించాలని, పనులను గడువు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.