
అక్రిడిటేషన్లు జర్నలిస్టుల ప్రాథమిక హక్కు
గుంటూరు వెస్ట్: సమాజానికి ఫోర్త్ ఎస్టేట్‌గా సేవలందిస్తున్న జర్నలిస్టులు అక్రిడిటేషన్లు పొందడం ప్రాథమిక హక్కని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ఎన్ మీరా, కె.రాంబాబు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింన్నారు. ఏడాదిన్నర దాటుతున్నా నూతన అక్రిడిటేషన్లుగాని, బదిలీ ప్రక్రియగానీ చేపట్టలేదన్నారు. మూడు నెలలకొకసారి పొడిగించుకుంటూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల జర్నలిస్టులు కనీసం బస్‌పాస్ అవకాశం కూడా సరిగ్గా పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి బదిలీ అవుతున్న సీనియర్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు కూడా బదిలీ చేయడం లేదని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారని గుర్తుచేవారు. దీనిని ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రద్దు చేసిన యాక్సిడెంటల్ పాలసీలను కూడా పునరుద్ధరించాలన్నారు. తమిళనాడు, బిహార్ రాష్ట్రాల తరహాలో సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు మూడు నెలలకొకసారి మీటింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో యూనియర్ నాయకులు భక్త వత్సల రావు, కందా ఫణీంద్ర, కిరణ్, సువర్ణ కుమార్, శ్రీనివాస్, గిరి, కరీం బాషా, తిరుపతి రెడ్డి, ఆసిఫ్ ఖాన్, సుభాని, కార్తీక్ పాల్గొన్నారు.