
వ్యాసాయ.. విష్ణురూపాయ!
అమరావతి: సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువుగా, వేదవ్యాసుడిగా అవతరించాడని భవఘ్ని గురూజీ అన్నారు. మండల పరిధిలోని వైకుంఠపురం భవఘ్ని ఆరామంలోని వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో గురుపూర్ణిమ వేడుకలలో చివరి రోజున వ్యాస ఆరాధన ఘనంగా నిర్వహించారు.
భవఘ్ని గురూజీ మాట్లాడుతూ వేద వ్యాసుడు నాలుగువేదాలు, అష్టా దశ పురాణాలతో పాటుగా మహాభారతాన్ని మానవాళికి అందించాడన్నారు. మానవుడిని సన్మార్గంలో నడిపించి, అధ్యాత్మిక జ్ఞానసంపదను అందించిన గురువులను స్మరించుకోవటం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ఆదిగురువు వ్యాస భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదవ్యాస భగవానుని ఆశీర్వచనం అందరికీ అందించారు. వేడుకల్లో భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు.
సాయిబాబా మందిరంలో...
పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీ షిర్డీసాయి – పర్తిసాయి కపోతేశ్వర ధ్యాన మందిరంలో గురుపూర్ణిమ వేడుకలను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామునే బాబావారికి సుప్రభాతసేవ, నగర సంకీర్తన, షిర్డీ హారతి కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తర్వాత బాబా విగ్రహానికి పంచామృతాలతో మహా భిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకారం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ, షిర్డీబాబా, సత్యసాయిబాబా చిత్రపటాలకు, బాబావారి పాదుకలకు భక్తులతో పూజలు చేయించారు. చివరగా అన్నదానం నిర్వహించారు,.
వైకుంఠపురం భవఘ్ని ఆరామంలో
ఘనంగా గురుపూర్ణమి

వ్యాసాయ.. విష్ణురూపాయ!