గుంటూరు ఎడ్యుకేషన్: కార్పొరేట్ జూనియర్ కళాశాలలు నడుపుతున్న హాస్టల్ క్యాంపస్‌లలో అధ్వాన పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరు శివారు రెడ్డిపాలెంలోని శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్ జూనియర్ కళాశాలలకు చెందిన హాస్టళ్లను ఆమె విద్యాశాఖాధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈసందర్భంగా హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై ఆమె విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. రెడ్డిపాలెంలోని శ్రీచైతన్య పాఠశాలలో డైనింగ్‌హాలు, టాయిలెట్లు, హాజరు పట్టికలను పరిశీలించారు. అనుమతులు లేకుండా ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణ, గాలి, వెలుతురు లేకపోవడం, తగిన విద్యార్హతలు లేని ఉపాధ్యాయులతో బోధన, టాయిలెట్ల అపరిశుభ్రత, ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో ప్రదర్శించకపోవడం చూసి పాఠశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
● నాలుగు అంతస్తుల భవనంలో వందలాది మంది విద్యార్థులను ఉంచడంతో పాటు సెల్లార్‌లో స్టడీ అవర్స్ నిర్వహించడంపై పాఠశాల ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. నాణ్యత లేని ఆహారాన్ని పిల్లలకు అందించడంతో పాటు అనేక లోపాలను గుర్తించారు. బాలల రక్షణ, సంరక్షణ కోసం అమలు చేస్తున్న చట్టాల్లో పేర్కొన్న నిబంధనలేవీ పాటించకపోవడాన్ని గుర్తించిన పద్మావతి, తక్షణమే వాటిని సరిదిద్దుకోవాలని, లేని పక్షంలో కమిషన్ చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
● కళాశాల, పాఠశాల హాస్టల్ క్యాంపస్‌లలో ఫిర్యాదుల బాక్సులు లేకపోవడం, విద్యార్థినులు నివశిస్తున్న గదుల్లోనే వస్త్రాలను ఆరబెట్టుకోవడం, ఒక్కో గదిలో 20 మంది విద్యార్థినులు ఉండటాన్ని గమనించారు. రన్నింగ్ వాటర్ లేకపోవడంతో పాటు కళాశాలలో హెల్ప్‌లైన్ నంబరు సైతం లేకపోవడం, ఆయా కళాశాలల హాస్టళ్లకు అనుమతులు ఏ విధంగా ఇచ్చారంటూ అధికారులను ప్రశ్నించారు. ఆమె వెంట ఆర్‌ఐఓ జి.సునీత, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పి.ప్రసన్న, అర్బన్ సీడీపీఓ జి.అరుణ, న్యాయ, పర్యవేక్షణాధికారి బి.వాసంతి, డీవైఈఓ జి.ఏసురత్నం, ఎంఈఓలు అబ్దుల్ ఖుద్దూస్, జ్యోతి కిరణ్, నాగేంద్రమ్మ, పి.నీలిమ పాల్గొన్నారు.
బహుళ అంతస్తుల భవనాలు, సెల్లార్లలో తరగతులు, మురికి టాయిలెట్లు, అధ్వాన డైనింగ్ హాళ్లు నిర్వాహకులపై బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు పద్మావతి ఆగ్రహం కనీస వసతులు లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణంపై మండిపాటు