
23 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
గుంటూరు వెస్ట్: గృహావసరాలకు వాడుకోవాల్సిన గ్యాస్ సిలిండర్లను వ్యాపారం కోసం వాడుకుంటున్నారన్న వచ్చిన సమాచారం మేరకు సివిల్ సప్లయీస్ అధికారులు మంగళవారం ఉదయం దాడులు నిర్వహించి 23 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కళ్యాణి టిఫిన్స్, వినాయక టిఫిన్స్, సత్య నాగా టిఫిన్స్ నుంచి ఈ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 6ఏ కేసులు నమోదు చేశామని సివిల్ సప్లయీస్ డీటీ బేగ్ తెలిపారు.
22న మెగా జాబ్‌మేళా
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 22న బ్రాడీపేట 3వ లైనులోని మాస్టర్‌మైండ్స్ క్యాంపస్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సంజీవరావు మంగళవారం ఓప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయోడేటా, రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో ఈనెల 22న ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. 20కి పైగా కంపెనీలు పాల్గొంటున్న జాబ్‌మేళాలో 679 ఉద్యోగావకాశాలు ఉన్నాయని తెలిపారు. వివరాలకు తమ ప్రతినిధులు వెంకట్ అల్లూరి (89195 08017), షేక్ ఎండీ రఫీ (88860 65546), ఎ.రామకృష్ణారెడ్డి (77319 82861) నంబర్లలో సంప్రదించాలని సూచించారు.