
పసుపు విత్తనం నాటడం ఇక తేలిక
కొల్లిపర: మండలంలో తొలిసారిగా బొమ్ము వేణుగోపాలరెడ్డి అనే యువ రైతు పసుపు విత్తనం నాటే యంత్రం(టర్మరిక్ ప్లాంటర్) కొనుగోలు చేసి దాని ద్వారా ముగ్గురు కూలీలతో అతి తక్కువ ఖర్చుతో పసుపు విత్తనం నాటటం ప్రారంభించాడు. యంత్రాన్ని ముందుగా ట్రాక్టర్‌కు అనుసంధానం చేయాలి. పై భాగాన ఉన్న కంటైనర్‌లో 300 కేజీలు దాకా పసుపు కొమ్ములు వేయాలి. యంత్రానికి ఇరువైపులా ఇద్దరు కూలీలను ఉంచాలి. ట్రాక్టర్ కదలగానే దానికి అనుగుణంగా చైన్ తిరుగుతుంది. ఈ క్రమంలో బాక్స్‌లో ఉన్న పసుపు కొమ్ములను కూలీలు యంత్రానికి అమర్చిన చిన్న చిన్న కప్పుల్లోకి ఒకటి రెండు ఉంచటం వల్ల అవి కిందకు వెళుతుంటాయి. అక్కడ రెండువైపులా ఉండే గొట్టాలు మట్టిలో నాలుగు అంగుళాల లోతులో బెజ్జం పెడతాయి. వెంటనే గిన్నెలోంచి దిగువకు వచ్చే విత్తనం గొట్టంలో నుంచి నేరుగా అదే బెజ్జంలోకి పడిపోతుంది. ఆ తర్వాత అడుగున ఉండే రేకు విత్తనంపై మట్టిని కప్పేస్తుంది. ఆ విధంగా ట్రాక్టర్‌కు అనుసంధానం చేసిన టర్మరిక్ ప్లాంటర్ సహాయంతో ఎత్తు మడులపై పసుపు విత్తనాన్ని నాటవచ్చు. కొమ్ములను నిర్ణీత దూరంలో క్రమపద్ధతిలో విత్తటం వల్ల పైరుకు ఎదిగిన తరువాత గాలీ, వెలుతురు ధారాళంగా అందుతుంది. దీంతో వర్షాలు ఎక్కువ కురిసినా, నీరు నిలబడినా పంటకు ఇబ్బంది ఉండదు. యంత్రం ద్వారా తక్కువ సమయంలో తక్కువ కూలీలతో పసుపును నాటవచ్చు.
ఎకరానికి రూ.7వేలు వసూలు
యంత్రం ద్వారా ఎకరానికి నాలుగు పుట్టు (పుట్టు విత్తనం 225 కేజీలు) విత్తనం కొనుగోలు చేయాలి. తరువాత ఒక కొమ్మును రెండుగా చేసుకోవాలి. ఆ తర్వాత ముగ్గురు కూలీలతో రెండు గంటల్లోపు ఎకరంలో పసుపు విత్తనం నాటవచ్చు. దీంతో రైతుకు విత్తనం కొనుగోలులో మూడు పుట్టు తగ్గటంతో పాటు కూలీల వ్యయం కూడా తగ్గుతుంది. రోజుకు నాలుగు ఎకరాలల్లో విత్తనం నాటొచ్చు. ప్రస్తుతం ఎకరానికి రూ.7వేలు వసూలు చేస్తున్నారు. దీంతో పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
అందుబాటులోకి యంత్రం ఎకరానికి రూ.30 వేల నుంచి రూ. 40వేల వరకు తగ్గుతున్న ఖర్చు