
పాత జాతీయ రహదారిపై కారు బీభత్సం
వీఆర్వోతో పాటు మరో నలుగురికి గాయాలు
తాడేపల్లి రూరల్ : మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా వీఆర్వోతో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వైద్యం నిమిత్తం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు అతి వేగంగా వెళుతున్న కారు పాత జాతీయ రహదారిపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గర ఎదురుగా వస్తున్న నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. తొలుత పెదకాకాని నుంచి బదిలీ అయి ఇప్పటం వీఆర్వోగా విధులకు హాజరయ్యేందుకు నులకపేటలోని తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్న జయంతి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఐదు అడుగులు పైకి లేచి రోడ్డుపై పడింది. ఈ ఘటనలో ఆమెకు కుడి కాలు మోకాలి వద్ద విరిగిపోయింది. వీఆర్వో ద్విచక్ర వాహనం అనంతరం కారు మరో రెండు వాహనాలను ఢీకొంది. ఇందులో ఇద్దరు పురుషులు, మహిళ, చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. వీఆర్వోను 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన నలుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన కారు అతి వేగంగా ఉండవల్లి సెంటర్ వైపు వెళ్లడంతో యువకులు ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ వారి వాహనాలను సైతం ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటనపై తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య, ఆర్‌ఐ వేదాంతం వివరాలు సేకరిస్తున్నారు.