
సెల్‌ఫోన్ లేని బడి నేడు అవసరం
తెనాలి: నేటి కాలంలో పిల్లల విద్యాభివృద్ధికి సెల్‌ఫోన్ అత్యంత అవాంతరంగా మారిందని, పాఠశాలలో సెల్‌ఫోన్‌తో పని లేని విధానం ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం తెనాలి ప్రాంతీయ కార్యాలయంలో జరిగింది. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సెల్‌ఫోన్ ప్రభావంతో పిల్లలు పాడైపోతున్నారని, ఉపాధ్యాయుల భోదనపై కూడా సెల్ ప్రభావం పడుతోందని అన్నారు. రోజువారీ రకరకాల సమాచారం అప్‌లోడ్, డౌన్లోడ్‌తో, ఆన్‌లైన్ శిక్షణలతో బోధన సమయం హరించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు కూడా సెల్ ఫోన్ వాడకం నియంత్రణలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. టెక్నాలజీని అవసరం మేరకు మాత్రమే వినియోగించుకోవాలని, అతిగా ఆధారపడి, దానికి బానిసగా మారితే కర్తవ్యం మరుగునపడి వ్యవస్థ పతనం అవుతుందని అన్నారు. బోధన సమయాన్ని పిల్లలకు మా త్రమే కేటాయించాలని, పాఠశాల రోజువారీ పనిని మెరుగుపరచాల్సిన అవసరం ఉపాధ్యాయులపై, అధికారులపై ఉందన్నారు. అవసరమైతే అదనంగా ఒక గంట పాఠశాలలో సమయాన్ని గడిపి విద్యార్థులకు మార్గదర్శనం చేయాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ పీటీఎంలో విట్నెస్ అధికారిని నియమించాలనే ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ టీఎస్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్‌ను తక్షణం నియమించాలని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్, ఎం.కళాధర్‌లు మాట్లాడుతూ బదిలీలు, ప్రమోషన్లు తర్వాత ఉపాధ్యాయులకు డీడీఓ కోడ్స్, పొజిషన్ ఐడీలో తక్షణం కేటాయించి జీతాలు ఈ నెలలోనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా సహాధ్యక్షులు ఎ.వెంకటేశ్వర్లు, కోశాధికారి దౌలా, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు