
తెప్ప తగలేసే రకం చంద్రబాబు
ఏరుదాటాక
తెనాలి: ఏరుదాటాక తెప్ప తగలేసే చరిత్ర చంద్రబాబుది.. గతంలో రైతు రుణమాఫీని ఏవిధంగా చేసిందీ చూశాం. జనసేన, టీడీపీల ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్‌సిక్స్ హామీలనూ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ పై తెనాలి నియోజకవర్గ సమావేశం సోమవారం సాయంత్రం ఇక్కడి గంగానమ్మపేటలోని ఎం.కన్వెన్షను హాలులో జరిగింది. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. అంబటి రాంబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, చంద్రబాబు సూపర్‌సిక్స్ హామీలను నిలబెట్టుకోకపోగా బుకాయిస్తున్నాడని, పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నిర్బంధించటం మినహా పరిపాలనపై దృష్టిలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు తండోపతండాలుగా జనం వస్తుండటాన్ని చూసి, ఎక్కడ తనపై వ్యతిరేకత వస్తుందోనని చంద్రబాబు కక్షగట్టారని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి చంద్రబాబు చేసిన మోసాన్ని చాటుతారని హెచ్చరించారు.
దిక్కుతోచని స్థితిలో ప్రజలు
సభాధ్యక్షుడు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ హామీలను అమలుచేయని కారణంగా ఒక్కో కుటుంబం ఏడాదిలో ఆర్థికంగా ఎంత నష్టపోయిందీ అవగాహన కల్పించాలని చెప్పారు. తెనాలిలో మూడు పార్టీల జెండాలు మెడలో వేసుకుని ఓట్లు అడిగిన నాయకులు, అధికారంలోకి వచ్చాక ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవాచేశారు. ఒకరికి సమస్యలు చెబితే పరిష్కారం కావనీ, ఇంకొకరికి చెబుదామంటే అందుబాటులో ఉండరని వ్యాఖ్యానించారు. ఎవరికి చెప్పుకోవాలో తెలీక దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలను కలిసి ఏమేరకు నష్టపోయిందీ తెలియజెప్పాలన్నారు.
క్యూఆర్ కోడ్ షీట్ ఆవిష్కరణ
తొలుత చంద్రముఖి సూపర్‌ఫ్లాప్–6 డీజే మిక్స్ ఆడియోను పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకుతెచ్చే క్యూఆర్ కోడ్ షీట్‌ను ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక, తెనాలి, కొల్లిపర ఎంపీపీలు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ అధ్యక్షులు దేసు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, కళ్లం వెంకటప్పారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ రహిమా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, పార్టీ ఇతర నాయకులు మాట్లాడారు. నియోజకవర్గం నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో హాజరయ్యారు.
గతంలో రైతురుణమాఫీని ఏవిధంగా చేశారో చూశాం ఇప్పుడు సూపర్‌సిక్స్ హామీలపైనా మోసం అదేమంటే నాలుక మందం అంటున్నాడు కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా కృషి జరగాలి బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు