
చదరంగంలో చిచ్చర పిడుగులు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): మేధావుల క్రీడగా పేరుగాంచిన చదరంగానికి ఘన చరిత్రే ఉంది. మన దేశంలో పుట్టి ఖండాంతరాలు విస్తరించిన ఈ క్రీడలో రాణించాలంటే అంత సులభం కాదు. ఏకాగ్రతతోపాటు అకుంఠిత దీక్ష ఎంతో ముఖ్యం. ఈక్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారికతోపాటు ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ మెహర్, మౌనిక, అక్షయలాంటి వారు గుంటూరుకు చెందిన వారే. చక్కని క్రీడాకారులతోపాటు ప్రతిభగల కోచ్‌లు కూడా జిల్లాలో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 200 మందికి పైగా చిన్నారులు చెస్ సాధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా చెస్ శిక్షణలో పేరుతెచ్చుకున్న జీనియస్ చెస్ అకాడమీ క్రీడాకారులు దూసుకుపోతున్నారు. ఈ నెల 10 నుంచి ఫ్రాన్స్‌లో జరగనున్న అంతర్జాతీయ ఫిడే రేటింగ్ టోర్నమెంట్‌కు చల్లా నిహారిక ఎంపికయ్యింది. ప్రస్తుతం ఆమె 2072 ఫిడే రేటింగ్స్‌తో ఉంది. ఈ సీజన్ అనుకున్నట్లు జరిగితే ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించే అవకాశముందని కోచ్ చల్లా రవీంద్ర రాజు అంటున్నారు.
ఫిడే రేటింగ్స్‌తో దూసుకుపోతున్నగుంటూరు క్రీడాకారులు ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ రేసులో నిహారిక
ఉమెన్ ఇంటర్నేషనల్ రేటింగ్ సాధిస్తా
ఈ నెలలో ఫ్రాన్స్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ పోటీల్లో నా ఫిడే రేటింగ్ మెరుగు పరచుకునే అవకాశముంది. ప్రస్తుతం 2072 పాయింట్లతో ఉన్నాను. 2200 పాయింట్లు వస్తే ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా దక్కుతుంది. గత ఏడాది ఇటలీలో జరిగిన బెల్లా ఇటాలియన్ 2100 పాయింట్ల లోపు టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. ఇప్పటివరకు 20 అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. ఈ ఏడాది గుజరాత్‌లో జరిగిన జాతీయ మహిళల చెస్ పోటీల్లో టీమ్ విభాగంలో తృతీయ స్థానం లభించింది. ఏంబీఏ చేస్తున్నాను. చదువును, చెస్‌ను సమన్వయం చేసుకోవడం కొంచెం కష్టమే. అయితే ఉన్న సమయాన్ని ప్లాన్ చేసుకుంటే చాలా సులభం. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇంత వరకు వచ్చాను. దీంతోపాటు కోచ్ రవీంద్ర రాజు శిక్షణ ఎంతో నేర్పింది. – చల్లా నిహారిక, గుంటూరు

చదరంగంలో చిచ్చర పిడుగులు