
గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తాం..
జే.పంగులూరు: కూటమి ప్రభుత్వం పొగాకు రైతులకు అండగా, వారికి గిట్టుబాటు ధరను కల్పిస్తూ మార్కెఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, కలెక్టర్ వెంకటమురళి అన్నారు. మండల పరిధిలోని మార్కెట్ యార్డులో నల్ల బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో మొత్తం 18 పొగాకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం పంగులూరు, పర్చూరు, ఇంకొల్లు మూడు కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. రైతులు అధైర్యపడొద్దని, పండించిన పొగాకును పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రైతులు పండించిన పంటను అమ్ముకోలేని దీనస్థితిలో ఉన్నారన్నారు. పొగాకు కొనుగోలుకు ప్రభు త్వం రూ.270 కోట్లు కేటాయించిందన్నారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామన్నారు. రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామన్నారు. పొగాకు సరుకును బట్టి రూ.6 వేలు నుంచి రూ.12 వేల వరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.