
నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టవద్దని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఇన్‌చార్జి కలెక్టర్ ఏ.బార్గవ్ తేజ, డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, డీఆర్వో ఖాజావలి, ఆర్డీవో శ్రీనివాసరావు ప్రజల నుంచి 260 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుని ఫిర్యాదును సరిగా ఎండార్స్ చేయడం లేదని, సంబంధిత శాఖలో సరైన అధికారికి పంపడం లేదన్నారు. ఉన్నతాధికారులు కూడా తనిఖీలు నిర్వహించకుండా కిందిస్థాయి అధికారులే పరిష్కరిస్తున్నారని తెలిపారు. సరిగా స్కాన్ చేయకుండా అప్‌లోడ్ చేస్తున్నారని, గ్రీవెన్స్ అధికారులే సమస్యను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. అర్జీదారుడికి సమస్యను పరిష్కరించిన విధానాన్ని క్షుణ్ణంగా తెలియ జేయాలని చెప్పారు. అధికారుల పనితీరుపై ఫీడ్ బ్యాక్ అందించాలని తెలిపారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి తగ్గుతోందని, దాన్ని పెంచడానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ కమిషన్, కోర్టు కేసులకు సంబంధించి నిర్ణీత సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఉన్నతాధికారులకు కలెక్టర్
ఎస్.నాగలక్ష్మి ఆదేశం