
కనుల పండువగా జగన్నాఽథ రథయాత్ర
తెనాలి: ఇస్కాన్ తెనాలి ఆధ్వర్యంలో జగన్నాధ రథయాత్ర సోమవారం కన్నులపండువగా జరిగింది. రథ్‌ఫెస్ట్–2025 పేరుతో నాలుగు రోజుల పాటు చేపట్టిన ఉత్సవాల మూడో రోజు రథయాత్ర నిర్వహించారు. పట్టణ శివాజీ చౌక్ నుంచి మధ్యాహ్నం రథయాత్రను ఆరంభించారు. గాంధీ చౌక్, నెహ్రూ రోడ్డు, రజక చెరువు, ప్రకాశం రోడ్డు, గంగానమ్మపేట, గాడి బావి సెంటర్, బోసు రోడ్డు, చినరావూరు పార్కుకు వెళ్లి, తిరిగి బోసు రోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణానికి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన గుండిదా మందిరంలో జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర మాతను కొలువుదీర్చి, ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు జగన్నాథుడు, రథయాత్ర విశిష్టతను తెలియజేశారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఒకటో తేదీ సాయంత్రం వరకు జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర మాత అక్కడే కొలువై ఉంటారు. సుభద్ర దేవీకి సౌభాగ్య సారె కార్యక్రమం నిర్వహిస్తారు. రథయాత్రకు ముందు విజయవాడకు చెందిన జిజ్ఞాస సాంస్కృతిక సంస్థ వారి క్యూరేషన్‌లో పలు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. ఇస్కాన్, తెనాలి మేనేజరు హెచ్‌జీ సింహగౌరదాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలో దేశం నలుమూలల్నుంచి కళాకారులు పాల్గొన్నారు. విదేశీ భక్తులు కమలకాంత దాస్, జిజ్ఞాస నుంచి రథయాత్ర క్యూరేటర్ రోహిణి వైష్ణవి, కన్వీనర్ వెంకటేష్ బత్తుల, గీతిక, మీనాక్షి, మేఘన, రవితేజ, మోహనకృష్ణ పాల్గొన్నారు. రథ్ ఫెస్ట్‌లో భాగంగా 28, 29 తేదీల్లో పిల్లలకు, యువతకు సాంస్కృతిక పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే.