
ఈ నగరానికి ఏమైంది?
● అదనంగా విధుల్లోకి తీసుకున్న కార్మికులు ఎక్కడ ? ● నగరంలో గ్రీనరీతో ఒక్క రోడ్డు కూడా లేదు ● 10వేల మొక్కలు కార్పొరేషన్‌కు వస్తే కనిపించేది 305 మాత్రమే.. ● సచివాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేని పరిస్థితి ● కౌన్సిల్‌లో అధికారులను నిలదీసిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు
గుంటూరులో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానం
పారిశుద్ధ్య నిర్వహణ వంద శాతం సంతృప్తి ఇవ్వదు: కమిషనర్
కార్పొరేటర్లు, ప్రజారోగ్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ అనేది వంద శాతం సంతృప్తి ఇవ్వదని, మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది.. అదనంగా 150 మందిని విధుల్లోకి తీసుకున్నా వారు ఎక్కడ పని చేస్తున్నారో కూడా తెలియదు.. ట్రాక్టర్లు డివిజన్‌కు ఒకటి కేటాయించామని అధికారులు చెబుతున్నా, ఎప్పుడు వస్తున్నాయో తెలియడం లేదంటూ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అధికారులను నిలదీశారు. నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం సోమవారం నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన నిర్వహించారు. తొలుత అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతులు, మాజీ కార్పొరేటర్ కారసాని సామ్రాజ్యానికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. సోమవారం కౌన్సిల్ సమావేశం మేయర్ అధ్యక్షతన ఉదయం 10.47గంటలకు ప్రారంభమైంది. సభ్యుల 35 ప్రశ్నలకు, 105 కార్పొరేషన్ ప్రియాంబుల్స్, ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
● పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నగరంలో వీఐపీలు తిరిగే ప్రధాన రహదారి ఐటీసీ రోడ్డులో ఉన్న మూడు చోట్ల చెత్త పాయింట్లను శుభ్రపరచడంలో అధికారులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ప్రధాన రాహదారే అధ్వానంగా ఉందని, ఇక నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. నగరంలోని సచివాలయాల్లో ఒక్కరే ఉద్యోగి పని చేస్తున్నారని, అతడు కూడా వాచ్‌మెన్‌గా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఏదైనా సమాచారం అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజాప్రతినిధులైన తమకు చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు. పర్మిషన్ లేని భవనాలు స్వయంగా చూపించినప్పటికీ ఇంత వరకు చర్యలు లేవని తెలిపారు. 21వ డివిజన్‌లో రోడ్డుకు అడ్డంగా బిల్డింగ్ కడితే దాన్ని కూల్చాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశిస్తే ఇంత వరకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
● తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ చెత్త వేయకుండా గ్రీన్ మ్యాట్లు కట్టినా ఉపయోగం లేకుండా ఉందని తెలిపారు. అక్కడే చెత్త వేస్తున్నారని చెప్పారు. నగరంలో గ్రీనరీతో కూడిన బ్యూటిఫికేషన్ రోడ్డు ఒక్కటీ లేదని, కనీసం కార్పొరేషన్ కార్యాలయం ముందు కూడా చేసుకోలేకపోతున్నామని విమర్శించారు. పక్కనే ఉన్న తెనాలి, పొన్నూరులో గ్రీనరీ బాగుందని, కలెక్టరేట్ రోడ్డును కూడా అభివృద్ధి చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థకు 10వేల మొక్కలు వస్తే అందులో నాటింది 305 మాత్రమేనని, మిగిలిన వాటి సంరక్షణ ఏంటని? ఆయన ప్రశ్నించారు. సచివాలయాల్లో సక్రమంగా ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేదని, పనుల మీద వచ్చిన ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అధికారులు ఇంటర్నెట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా ?అని నిలదీశారు.
● ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ సుబ్బారెడ్డి నగర్‌లో రెండు సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ పని చేయడం లేదని, ఎందుకు అతని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. 25వ డివిజన్‌లో అనధికార లే అవుట్స్ పెరిగిపోతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
● గతంలో మా వార్డులో 60 మంది పారిశుద్ధ్య కార్మికులుంటే ప్రస్తుతం 30 మంది మాత్రమే ఉన్నారని..కాలువలు తీయడానికి మనుషులు లేరని కార్పొరేటర్ వెంకట కృష్ణ తెలియజేశారు.
● అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను కుదించే ప్రయత్నంలో ఉందన్నారు. నగరంలోని ఉన్న 207 వార్డు సచివాలయాలను 103 క్లస్టర్స్‌గా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అయిపోగానే సిబ్బంది రేషనలైజేషన్ చేస్తామని వెల్లడించారు.
● గుంటూరు నగరంలో 1256 హోర్డింగ్స్ ఉంటే అందులో 250కి మాత్రమే స్టెబిలిటీ సర్టిఫికేట్ ఉందని.. ప్రమాదం సంభవిస్తే ఎవరిది బాధ్యత అని కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, షేక్ రోషన్, దూపాటీ వంశీ కౌన్సిల్‌లో టౌన్‌ప్లానింగ్ అధికారులను నిలదీశారు.
● 17వ వార్డులో కాలువలు, డ్రైన్లపై కూడా భవన నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారి లక్ష్మణస్వామి అనుమతులు ఇస్తున్నారని.. ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని కార్పొరేటర్ ఫర్జానా డిమాండ్ చేశారు. వార్డులో టీడీపీ నాయకుల పెత్తనం పెరిగిపోయిందని, దీన్ని కట్టడి చేయాలని ఆమె కోరారు.
● వార్డులో అభివృద్ధి పనుల్ని కార్పొరేటర్‌కు చెప్పకుండానే అభివృద్ది పనులు ప్రారంభించారని...జేసీబీతో పనులు చేస్తున్న క్రమంలో వృద్ధుడి కాలు విరిగిందని..అసలు సిబ్బంది ఎవరూ లేకుండా పనులేలా చేస్తారంటూ కార్పొరేటర్ మల్లవరపు రమ్య నిలదీశారు.
● కార్మిక శాఖ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని పాపతోటి అంబేడ్కర్ కౌన్సిల్ అధికారులను కోరారు.
మాటలు సరిగా మాట్లాడు !
పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు చెప్పే మాటలు మాత్రమే మేయర్ నమ్ముతున్నారని.. తమ మాటలు నమ్మడం లేదని టీడీపీ కార్పొరేటర్ నూకవరపు బాలాజీ ప్రశ్నించారు. మాటలు సరిగా మాట్లాడు.. ఇక్కడ ఎవరి మాటలు నమ్మాలో, నమ్మకూడదో తనకు తెలుసని, పని చేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మేయర్ రవీంద్ర చెప్పారు.
సమ్మె చేస్తున్న వారిపై చర్యలు: మేయర్
నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు పెంచాలని కోరుతూ సమ్మె చేస్తున్నారని, వీధి లైట్లు వెలగనీవ్వడం లేదని పలువురు కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మేయర్ రవీంద్ర మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు.

ఈ నగరానికి ఏమైంది?