
ఏసీబీకి చిక్కిన దేవదాయ శాఖాధికారి
కొల్లూరు : లంచాల కోసం వ్యాపారులను వేధిస్తున్న దేవదాయ శాఖ ఉద్యోగి ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మత్తే మహేంద్ర కథనం మేరకు... బాపట్ల జిల్లా కొల్లూరు దేవాలయాల సమూహ ఈఓగా పనిచేస్తున్న నాగిశెట్టి శ్రీనివాసరావు కొద్ది రోజులుగా ఆలయ దుకాణాదారులను లంచాలు ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. కొల్లూరుకు చెందిన వంకాయల సాయి తన తండ్రి లక్ష్మినారాయణ మరణించడంతో శ్రీ అనంతభోగేశ్వరాలయం పరిధిలో ఉన్న 6వ నంబర్ దుకాణాన్ని తన సోదరుడు రమేష్ పేరుమీదకు మార్చాలని శ్రీనివాసరావును పది రోజుల క్రితం కోరాడు. దుకాణం పేరు మార్పుకు రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, అంతమొత్తం ఇచ్చుకోలేనని తెలపడంతో రూ.70 వేలు చెల్లించాలని లేని పక్షంలో దుకాణం స్వాధీనం చేసుకుంటామని ఆలయ అధికారి హెచ్చరికలు చేశాడు. ఆలయ అధికారి అర్ధరాత్రి సమయాలలో సైతం ఫోన్‌లు చేసి లంచం నగదు కోసం వేధిస్తుండటంతో ఆయన అడిగిన మొత్తం సోమవారం ఇస్తానని సాయి ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కొల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయంలోని ఈఓ కార్యాలయంలో దుకాణదారుడు సాయి ఏసీబీ అధికారుల సూచనల మేరకు ఈఓకు రూ.60 వేలు నగదు చెల్లింపులు జరుపుతుండగా, అకస్మాత్తుగా దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దుకాణదారుడి నుంచి లంచంగా తీసుకున్న రూ. 60 వేలు నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ఈఓ కార్యాలయంలోనే రసాయనాలతో పలు పరీక్షలు నిర్వహించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించి దేవాదాయ శాఖాధికారి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఈఓ శ్రీనివాసరావును మంగళవారం విజయవాడలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు మహేంద్ర వెల్లడించారు. దాడులలో ఏసీబీ సీఐలు నాగరాజు, మన్మదరావు, సురేష్, సుబ్బారావు, ఎస్‌ఐలు చిచ్చా ఉరుకొండ, సుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు