తల్లికి వెన్నుపోటు
ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర
కూటమి ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి తూట్లు పొడిచింది. ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం ద్వారా రూ.15వేలు ఇస్తామని ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం తల్లులకు వెన్నుపోటు పొడిచింది. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన తల్లికి వందనం నిధులను విడుదల చేస్తున్నామంటూ ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటనలు చేసింది. తీరా జీవోల్లో పేర్కొన్న మార్గదర్శకాల్లో విధించిన ఆంక్షలతో వేలాది మంది అనర్హులయ్యారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత పథకం అమలుపై ఆర్భాటంగా ప్రకటనలు చేసిన ప్రభుత్వం, లబ్ధిదారుల ఎంపికలో ఆంక్షలు విధించడంతో అర్హులైన తల్లులు, విద్యార్థులు తీవ్రమైన నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని 1,730 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 3,00,732 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్మీడియెట్ విభాగంలో మరో 60వేల మంది ఉన్నారు. అయితే, తల్లికి వందనం పథకానికి 2,01,911 మంది విద్యార్థులను ఎంపిక చేసిన ప్రభుత్వం 1,32,746 మంది తల్లులను మాత్రమే అర్హులుగా గుర్తించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపింది. ప్రభుత్వ ఆంక్షలతో దాదాపు లక్ష మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందడం లేదు. ఇంటర్మీడియెట్ విభాగంలో మరో 60వేలను కలుపుకుంటే అనర్హుల సంఖ్య 1,60,000 ఉంది. జిల్లాలోని 1,074 ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 93,464 మంది విద్యార్థులతో పాటు 656 ప్రైవేటు పాఠశాలల పరిధిలో మరో 2,61,086 మంది విద్యార్థులు ఉన్నారు.
రెండు వేల రూపాయల కోత
హామీలు గుప్పించిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత తల్లుల ఖాతాల్లో రూ.13వేలు మాత్రమే జమ చేశారు. మిగిలిన రూ.రెండు వేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి నిధికి మినహాయించారు. సంబంధిత నిధులను జిల్లా కలెక్టర్ల ఆధీనంలో ఉంచే విధంగా జీవోలో పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తల్లులకు రూ.13వేలు ఇచ్చి, మిగిలిన రూ.రెండు వేలను వారి అంగీకారంతో పాఠశాలల అభివృద్ధి కోసం వినియోగించే ఏర్పాట్లు చేసిన సమయంలో టీడీపీ బురద చల్లింది. అయితే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ తెచ్చిన విధానాన్నే అమలు పరుస్తోంది. 2023–2024, 2024–25 విద్యాసంవత్సరాలకు ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభు త్వం ఎగ్గొట్టొంది.
ఆంక్షల ముసుగులో తల్లికి వందనం ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. గ్రామ, వార్డు సచివాయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలను ప్రదర్శిస్తున్నారు. సీబీఎస్‌ఈతో పాటు వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు జాబితాల్లో మాయమయ్యాయి. గత విద్యాసంవత్సరంలో టెన్త్, సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు మొండిచెయ్యి చూపారు. టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్, పాలిసెట్ వంటి కోర్సుల్లో చేరితేనే వారికి లబ్ధి కలుగుతుంది. సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులను అనర్హులుగా చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ గవర్నెన్స్ నంబరు 95523 00009కు హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా సేవల్లో తల్లికి వందనం స్థితిని ఎంపిక చేసుకుని, తల్లి ఆధార్ నంబరు నమోదు చేయాలి. తద్వారా తల్లికి వందనానికి అర్హులైనదీ, అనర్హులైనదీ తెలుసుకోవచ్చు.
వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలో వరుసగా నాలుగేళ్ల పాటు జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు.
విద్యా సంవత్సరం తల్లుల సంఖ్య ఆర్థిక లబ్ధి
2019–20 1,46,232 రూ.219.34 కోట్లు
2020–21 1,55,330 రూ.232.99 కోట్లు
2021–22 1,64,601 రూ.246.90 కోట్లు
2022–23 1,59,594 రూ.239.39 కోట్లు
విద్యుత్ వినియోగం, నెలసరి ఆదాయంతో అనర్హత వేటు
విద్యుత్ వినియోగం, నెలసరి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవడంతో తల్లికి వందనం పథకంలో వేలాది మంది విద్యార్థులు అనర్హులుగా మారుతున్నారు. గ్రామాల్లో నెలకు ఆదాయం రూ.10వేలు, పట్టణాల్లో రూ.12వేలకు మించితే కోత పడనుంది. గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు దాటినా అనర్హత వేటు పడుతుంది. ఈ రెండు ఆంక్షలతో జిల్లాలో వేలాది మంది అనర్హులుగా మారారు.
తల్లికి వందనం ఇస్తున్నామంటూనే ఆంక్షలు గుంటూరు జిల్లాలో 1,60,000 మందిపై అనర్హత వేటు గ్రామాల్లో నెలకు ఆదాయం రూ.10వేలు, పట్టణాల్లో రూ.12వేలకు మించితే పథకానికి కోత 300 యూనిట్లకు దాటి విద్యుత్ వినియోగించినా అనర్హత వేటు వై.ఎస్. జగన్ ప్రభుత్వంలోనాలుగేళ్ల పాటు ఆంక్షలు లేకుండా అమ్మఒడి అమలు ఆంక్షల ముసుగులో తల్లికి వందనం ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాల ప్రదర్శన సీబీఎస్‌ఈతో పాటు వివిధ పాఠశాలల్లో చదువుతున్న వారి పేర్లు జాబితాల్లో మాయం
జిల్లావ్యాప్తంగా
తల్లులకు
వందల కోట్ల రూపాయల
లబ్ధి
తల్లికి వెన్నుపోటు
తల్లికి వెన్నుపోటు


