గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా పోర్టుఫోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్యను న్యాయశాఖ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర, గుంటూరు నగర సంఘ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా కోర్టులో శనివారం జరిగిన జ్యుడీషియల్ ఆఫీసర్స్ వర్క్‌షాప్‌నకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య హాజరయ్యారు. న్యాయమూర్తిని కలసిన వారిలో న్యాయశాఖ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు చంద్రశేఖర్, నగర అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాసరావు, కార్యదర్శి సొర్రా బైరాగి, సంఘ సభ్యులు ఉన్నారు.
మల్లేశ్వరస్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
పెదకాకాని: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు దంపతులు శనివారం పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరసామి ఆలయానికి విచ్చేశారు. న్యాయమూర్తి దంపతులకు ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, అర్చక స్వాములు, వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ మేళతాళాలతో సాదర స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన వారు భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకస్వాములు, వేద పండితులు ఆశీర్వవచనం అందించారు. న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దంపతులను స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి చిత్రపటం, ప్రసాదాలను డీసీ అందజేశారు.
నేడు రెడ్ల రామమందిరం పునఃనిర్మాణానికి శంకుస్థాపన
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఉండవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న రెడ్ల రామమందిరం పునః నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8.20 గంటలకు జరిగే ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.
అంగన్‌వాడీ కేంద్రంలో మదర్స్‌డే వేడుకలు
గుంటూరు రూరల్: తల్లి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవీఎస్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం మదర్స్‌డే వేడుకలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తల్లులు ఆరోగ్యంగా ఉంటే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి తల్లి, గర్భిణి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా విని యోగించుకుని ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వాలన్నారు. అనంతరం కేక్ కట్‌చేసి పంచారు. కార్యక్రమంలో మోడల్ ఆఫీసర్ శ్రీవాణి, ప్రత్తిపాడు ప్రాజెక్ట్ సీడీపీవో విజయ నిర్మల, సూపర్‌వైజర్ వెంకటరత్నం, ఏఎన్‌ఎమ్‌లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, తల్లులు గర్భిణులు పాల్గొన్నారు.
రేపు త్రికోటేశ్వరస్వామికి లక్ష మల్లెల పూజ
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామికి ఈనెల 12వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించే లక్షమల్లెల పూజకు వేలాదిగా భక్తులు హాజరై స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.చంద్రశేఖరరావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. దాతల సహకారంతో ప్రతి ఏడాది వైశాఖ పూర్ణమి రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

హైకోర్టు జడ్జిని కలిసిన ఉద్యోగుల సంఘం నేతలు